విద్యార్థుల్లో చైతన్యం కోసం...
‘ఆదిత్య’ పేరుతో ఓ బాలల చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య క్లాప్ ఇచ్చారు. పి. విజయవర్మ గౌరవ దర్శకత్వం వహించారు. భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ -‘‘మూడు దశాబ్దాలుగా విద్యావేత్తగా ఉన్నాను.
విద్యార్థుల్లో చైతన్యం కలిగించి, వాళ్లల్లో విద్య, వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలనే సదాశయంతో ఈ చిత్రం చేస్తున్నాను. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. బ్రహ్మానందం ముఖ్య పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో బాలనటుల పాత్రలను ప్రవీణ్, రాహుల్, రోమీర్, షణ్ముఖ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, కెమెరా: కందేటి శంకర్, పాటలు: దానయ్య, ఆర్ట్: భాస్కర్.