నాలుగో రోజు నుంచి లాభాలే!
‘‘ఇప్పుడు హీరోలందరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తే మూస అవుతుందనీ, అందుకే కొత్త కథలతో సినిమాలు చేయాలనీ అనుకుంటున్నారు. శర్వానంద్ కూడా కొత్తగా కుటుంబ కథా చిత్రం చేశాడు. మంచి హిట్ అందుకున్నాడు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘శతమానం భవతి’ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కుటుంబ ప్రేక్షకులు చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నైజాం, కృష్ణా, విశాఖలలో మేమే స్వయంగా విడుదల చేశాం.
గుంటూరు, గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చేశాం. మూడో రోజుకి పెట్టిన డబ్బులు వచ్చేశాయని వారు చెబుతున్నారు. నాలుగో రోజు నుంచి లాభాలు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలకు దర్శకుడు సతీశ్ వేగేశ్న మా సంస్థలో పని చేశాడు. అతను చెప్పిన పాయింట్ నచ్చి ఏడాది పాటు కథపై వర్క్ చేశాం. హీరో నాని, ప్రకాశ్‌రాజ్ తదితరుల సలహాలు తీసుకుని సినిమా చేశాం.
మొదట్నుంచీ సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నా. ఈరోజు నా నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. ఓ రాజకీయ నాయకుడు సినిమాని ఇంత విశ్లేషిస్తారా! అనిపించింది. ఓవర్‌సీస్‌లో కూడా స్పందన బాగుంది. అక్కడ మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చే అవకాశముంది. నా సమాచారం ప్రకారం సంక్రాంతికి రిలీజైన ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, మా సినిమా... మూడూ బాగా ఆడుతున్నాయి’’ అన్నారు.