అయిదేళ్ల తరువాత ఐష్
వెండితెరపై ఐశ్వర్యా రాయ్ కనిపించి ఐదేళ్లయ్యింది. ఆమె తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ఇటీవల విడుదలైన ‘జజ్బా’ బ్రేక్ వేసింది. ఇన్నేళ్ల తర్వాత ఐష్‌ని మళ్లీ తెరపై చూడటం ఆమె అభిమానులను ఆనందపరిచింది. హిందీలో ఇటీవల విడుదలైన ఈ ‘జజ్బా’ను ఆరెంజ్ మీడియా అధినేతలు నివాస్‌వర్మ, సతీశ్ తెలుగులోకి ‘అడ్వకేట్ అనురాధ వర్మ’గా అనువదించారు. ఈ 6న చిత్రం విడుదల కానుంది.
నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఓటమి అనేది తెలియని అడ్వకేట్ అనురాధ వర్మగా ఇందులో ఐశ్వర్యా రాయ్ నటించారు. కథ గురించి చెప్పాలంటే... ఒక అమ్మాయిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఓ హంతకుడికి శిక్ష పడేలా చేయడానికి అనురాధ న్యాయస్థానంలో వాదిస్తుంది.
ఈ నేపథ్యంలో అనురాధ కూతుర్ని కిడ్నాప్ చూసి, ఆ కేసులో ఓడిపోవాలని కిడ్నాపర్లు బెదిరిస్తారు. కూతురి కోసం అనురాధ కేసు ఓడిపోయిందా? గెలవడంతో పాటు తన కూతుర్ని దక్కించుకుందా? అనేది మిగతా కథ. ఐశ్వర్యా రాయ్ అద్భుతంగా నటించారు. ఆద్యంతం ఉత్కంఠకు గురయ్యేలా దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించారు’’ అని చెప్పారు.