‘అత్యాశ’వాసి | agnyaathavaasi movie released 10th january | Sakshi
Sakshi News home page

‘అత్యాశ’వాసి

Published Wed, Jan 10 2018 9:42 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

agnathavasi movie released 10th january - Sakshi

యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే.. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సర్దార్‌ గబ్బర్‌ సినిమా డిస్ట్రిబ్యూటర్లయితే నష్టాలను భర్తీ చేయాలని ఏకంగా హైదరాబాద్‌లో ధర్నా కూడా చేశారు. మరోవైపు ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీచేయని, సంస్థాగత నిర్మాణం లేని పార్టీ అధినేతగా పవన్‌ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల తొత్తుగా మారి ‘భ’జనసేనగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్లో కూరుకుపోయాడు.

ఇక సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ రోజుకో ట్వీట్‌తో పవన్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో తన ఇమేజ్‌ తగ్గలేదని చాటేందుకు అజ్ఞాతవాసి హిట్‌ చేయడం తప్పనిసరి.. అంతేకాదు.. ఏకంగా బాహుబలి కలెక్షన్లనే పవన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడన్న వాదనలు ఉన్నాయి. సరే.. సినిమాలో విషయం ఉండి జనాలకు ఎక్కితే ఎవ్వరూ ఆపలేరు. కానీ ఇష్టారాజ్యంగా ప్రీమియర్‌ షోల పేరిట దోపిడీ పర్వానికి తెరతీయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా అజ్ఞాతవాసికి రోజుకు ఏకధాటిగా ఏడు షోలు.. అదీ ఒక్క రిలీజ్‌ రోజుకే కాకుండా రిలీజ్‌ నుంచి వారం పాటు 24 గంటలూ షోలకు సర్కారు అనుమతినివ్వడం వివాదాస్పదమవుతోంది.                                                                                                                                  
                                                                                              

సాక్షి, విశాఖపట్నం: పవన్‌ కల్యాణ్‌ వరుస చిత్రాలతో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కుదేలయ్యారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌కు ఒక్క హిట్‌ సినిమా పడలేదు. ‘ప్రత్యేక దేవుడు’ పాత్ర పోషించిన గోపాల గోపాల, గబ్బర్‌సింగ్‌ మేనియాతో హిట్టవుతుందని తీసిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్, రీమేక్‌ను నమ్ముకుని తీసిన కాటమరాయుడు.. ఈ మూడు సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి. నగరంలో ఓ సినిమా థియేటర్‌ యజమాని పవన్‌ మూడు చిత్రాల కలెక్షన్లపై యదార్థంగా చెప్పిన లెక్కలు ఓసారి చూద్దాం. గోపాల గోపాల సినిమాను తన థియేటర్‌లో ఆడించేందుకు రూ.12 లక్షలకు కొనుగోలు చేస్తే రూ.10 లక్షలు వచ్చింది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాకు రూ. 15లక్షలు పెడితే డిజాస్టర్‌ అయిన ఆ సినిమాకు కేవలం రూ. 6 లక్షల కలెక్షన్లే వచ్చాయి. అంటే రూ.9లక్షలు పోయాయి. 

ఇక కాటమరాయుడు సినిమాను రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే.. అట్టర్‌ ఫ్లాప్‌ అయిన ఆ సినిమాకు రూ.5 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే ఏకంగా పది లక్షలు పోయాయన్నమాట. ఇదంతా ఒక థియేటర్‌ కలెక్షన్‌ మాత్రమే. ఈ లెక్కన జిల్లా మొత్తం మీద ఆ మూడు సినిమాల వల్ల ఎన్ని రూ.కోట్లు పోయాయో అర్థం చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా నష్టాలను భర్తీ చేసే క్రమంలో కాటమరాయుడు సినిమా హక్కులు ఇస్తే అది మరింతగా నష్టాల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో  సర్దార్‌ గబ్బర్‌సింగ్, కామటరాయుడు సినిమాలను కొనుగోలు చేసిన సంస్థ ఏకంగా  రూ. 7కోట్ల నుంచి రూ.8 కోట్ల నష్టాల్లో మునిగినట్టు తెలిసింది. ఇక ఆ తర్వాత సదరు సినీపంపిణీ సంస్థ ఇప్పటివరకు మరే సినిమా డిస్ట్రిబ్యూషన్‌ చేయలేని పరిస్థితిలో ఉందని  చెబుతున్నారు.

అజ్ఞాతవాసితో దండుకోవాలని..
యాధృచ్ఛికమో.. ఇతరత్రా కారణాలేవైనా కావొచ్చు గానీ.. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఈ నాలుగేళ్లలో రిలీజ్‌ అయిన పవన్‌ సినిమాలన్నీ వరుసగా దెబ్బతిన్నా అజ్ఞాతవాసికి హైప్‌ ఏర్పడింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేదిల ట్రాక్‌ రికార్డు నేపథ్యంలో బయ్యర్లు అజ్ఞాతవాసిపై ఎగబడ్డారు. ఇదే అదనుగా ఇంచుమించు బాహుబలి–2 రేట్లకు సినిమాను విక్రయించారు. వాస్తవానికి జిల్లాలో బాహుబలి–1 రూ. 7కోట్లకు కొనుగోలు చేయగా రూ. 10 కోట్లు కలెక్ట్‌ చేసింది. బాహుబలి–2 సినిమా రూ. 14 కోట్లకు కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 18 కోట్ల వరకు వసూలు చేసిందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇదే రికార్డు. ఇప్పుడు పవన్‌ అజ్ఞాతవాసి సినిమాను ఏవీ సినిమాస్‌ అనే సంస్థ రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసింది. అంటే ఆ వసూళ్లు రావాలంటే సినిమా బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలి. ఇక్కడే పవన్‌కల్యాణ్‌ సినిమా నిర్మాతలు అడ్డగోలు వసూళ్లకు తెరలేపారన్న వాదనలు బలంగా ఉన్నాయి.

అప్పుడు బాహుబలుడు.. ఇప్పుడు అజ్ఞాతవాసీ .. అల్లుడు గారే
అజ్ఞాతవాసి సినిమా విశాఖ జిల్లా హక్కులను రూ.11.50కోట్లకు ఏవీ సినిమాస్‌ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఆ సంస్థలో ప్రధాన వాటా మంత్రి గంటా శ్రీనివాసరావు అల్లుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు(అంజిబాబు) కుమారుడు ప్రశాంత్‌దేనని తెలుస్తోంది. జిల్లాలో బాహుబలి–2 కూడా ఇదే సంస్థ పంపిణీ చేసింది.

రోజంతా సినిమానే..
ఇంతముందెన్నడూ ఏడు షోలకు అనుమతించిన పరిస్థితి లేదు. బాహుబలి సినిమాకు ఐదు షోలకు అనుమతిస్తేనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా థియేటర్లలో అదే పనిగా సినిమా ఆడించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలివ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ లెక్కన థియేటర్లను క్లీన్‌ చేయడానికి కూడా సమయం ఉండదేమోనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారంరోజుల పాటు ఒక్క ఐనాక్స్‌ (బాల్కనీ రూ.175) మినహా ఏ థియేటర్‌లోనైనా బాల్కనీ టికెట్‌ రేటు రూ.200కు పెంచేయడం దోపిడీ కాక మరేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో బాహుబలి విడుదల సమస్యలోనూ టికెట్ రేట్ లు పెంచటం విమర్శలకు తావిచ్చింది. అలాగే  నగరంలోని ప్రతి థియేటర్‌ వద్ద రాత్రి వేళల్లో  బందోబస్తుకు ఓ ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించనున్నామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement