సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తాను సీఎం రేసులో లేనన్న విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది. ఆ భేటీలో ఏమి చర్చించారో ఎవరికీ తెలియదు. అయితే, ఆ మరుసటి రోజే (గురువారం) ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడంలేదని పవన్ విశాఖపట్నంలో జరిగిన సభలో పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పదని ఆ సభలో స్పష్టం చేశారు.
జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీని కూడా గెలిపించాలని చెప్పారు. సీఎం పదవిపై తాను, బాబు మాట్లాడుకుంటామని అన్నారు. అవసరమైతే తనను తాను తగ్గించకుంటానని కూడా చెప్పారు. పవన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కంగుతిన్నారు. తనను తాను తగ్గించుకుంటానంటే సీఎం రేసు నుంచి తప్పుకొన్నట్లేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అదీ కాక.. పొత్తులో జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలవడం పక్కనపెడితే.. మిగిలిన స్థానాల్లో టీడీపీని జనసేనే గెలిపించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు పొత్తుల చరిత్ర పరిశీలిస్తే.. మిత్రపక్షాలనే మోసం చేస్తారన్నది సుస్పష్టమని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు చంద్రబాబు ఇచ్చేదే అరకొర సీట్లేనని, అక్కడా తన మనుషులను పోటీకి దింపి, పొత్తులో ఉన్న పార్టీనే దెబ్బేసే ఘనుడని, అలాంటి బాబు జనసేనకు ఇచ్చే సీట్లెన్ని, అందులో గెలిచేవెన్ని అని చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎక్కువ సీట్లు తీసుకొనే టీడీపీని జనసేన కష్టపడి గెలిపిస్తే.. అప్పుడు మెజార్టీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ జనసేనకు ఎందుకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు చరిత్ర తెలిసిన వారెవరూ ఇలాంటి భ్రమలు పెట్టుకోరని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పవన్ ఇలా మాట్లాడారంటే.. ఆయన సీఎం పదవిపై ఆశ వదులుకున్నట్లేనని భావిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన భేటీలో జనసేనకు చాలా తక్కువ సీట్లిస్తామని చంద్రబాబు చెప్పి ఉంటారని, ముఖ్యమంత్రి పదవిపై సైతం ఎటువంటి పంపకాలకు అవకాశమే లేదని తేల్చి చెప్పి ఉంటారని, అందువల్లే పవన్ విశాఖలో అటువంటి వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు అంటున్నారు.
తొలి నుంచి పవన్ నోట భిన్నమైన మాటలే..
జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ సొంత పార్టీ ప్రయోజనాలకన్నా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పవన్ పెద్ద పీట వేస్తున్నారని బలమైన ప్రచారం ఉంది. అదే నిజమని నిరూపించేలా పవన్ పలు మార్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – టీడీపీతో పొత్తుపై చర్చ మొదలైనప్పుడు, పవన్‌కు కూడా సీఎం పదవిని కేటాయించాలని టీడీపీని కోరాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దీనిపై పవన్ స్పందిస్తూ.. తాను సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమంటూ కొన్ని సందర్భాల్లో, 2019లో రెండు చోట్లా ఓడిపోయాక ఇప్పుడు టీడీపీని సీఎం పదవి ఎలా అడుగుదామంటూ పార్టీ నాయకులందరినీ గందరగోళపరుస్తూ మరోసారి మాట్లాడారు. ఆ తర్వాత రెండ్రోజులకే మళ్లీ సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధమని అన్నారు. టీడీపీ కోరకముందే పొత్తుకు పవన్ సిద్ధపడటం, జనసేనకు కేటాయించే సీట్లు ప్రాధాన్యతే కాదన్నట్టు మాట్లాడుతున్న తమ అధినేత అజెండా ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోందని జనసేన నేతల్లో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment