
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఎమ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘షీ ఇన్స్పైర్స్’ ప్రోగ్రాం విజేతలను శ్రీమతి అమల అక్కినేని సత్కరించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా తమ సంస్థలో ఫిలిం అండ్ మీడియాలో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అర్హురాలైన యువతికి లక్ష రూపాయల ‘అన్నపూర్ణ స్కాలర్షిప్’ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతిభావంతులైన యువతులు మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పురుషులతో సమానంగా తమ ప్రతిభ ప్రదర్శించేందుకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు మహిళా దినోత్సవం నాడు ఈ స్కాలర్షిప్ ని ప్రకటించారు.
శ్రీమతి అమల అక్కినేని ఈ స్కాలర్షిప్‌ని ప్రకటిస్తూ, ‘ఇది ప్రతిభ కలిగిన యువతను ఫిలిం అండ్ మీడియా రంగంలో నిష్ణాతులుగా చేయాలన్న మా ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తుంది’ అన్నారు. ఈ స్కాలర్షిప్ అత్యంత ప్రతిభాపాటవాలు చూపిన, అర్హులైన యువతికి అందజేస్తారు. తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని స్వయంశక్తితో విజేతలుగా నిలబడ్డ మహిళలను గౌరవించడానికి రూపొందిచబడ్డ కాంటెస్ట్ ‘షీ ఇన్స్పైర్స్’. గత సంవత్సరం ప్రారంభించబడ్డ ఈ కాంటెస్ట్ 2వ సీజన్ లో భాగంగా ఈ సంవత్సరం వచ్చిన 62 నామినేషన్లలో ఉత్తమ 5 గురిని ఎంపిక చేయడానికి జ్యూరీ చాలా కష్టపడాల్సి వచ్చింది.
ప్రముఖ నటి, సమాజ సేవకురాలు, విద్యావేత్త శ్రీమతి అమల అక్కినేని మాట్లాడుతూ, ‘స్త్రీ శక్తికి మించిన శక్తి లేదు. తానే ఒక సూపర్ పవర్. ఈ డిజిటల్ యుగంలో అందరికీ ఎన్నో అవకాశాలున్నాయి, ముఖ్యంగా మహిళలకి తమ ప్రతిభ ప్రదర్శించే అవకాశం చాలా ఉంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉండేందుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. లెక్కలేనన్ని అవకాశాలున్న మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో టాలెంటెడ్, క్రియేటివ్, హార్డ్ వర్క్ చేసే వారికి చాలా డిమాండ్ ఉంది. వినూత్న ఆలోచనలు కలిగి ఉన్న యువతులని ఈ క్రియేటివ్ ఫీల్డ్ లోకి ఆహ్వానిస్తున్నాను. తద్వారా ఈ రంగంలో తమదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
అమల అక్కినేని చేతుల మీదుగా ‘షీ ఇన్స్పైర్స్’ విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైబ్రాంట్ లివింగ్ ఫుడ్స్ ఎమ్.డి శ్రీదేవి జాస్తి, అన్నపూర్ణ స్టూడియోస్ సి.ఎఫ్.ఓ సుష్మ, ఫీవర్ ఎఫ్.ఎమ్ ఆర్.జె మానస పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment