
నాకు ఆ ఫీలింగే లేదు!
దాదాపు అయిదేళ్ళ గ్యాప్ తరువాత ‘జజ్బాజ్’ చిత్రంతో మళ్ళీ వెండితెర మీదకు వస్తున్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆనందంగా ఉన్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌కు వస్తున్న స్పందనే అందుకు కారణమంటున్నారు. అయితే, ఈ సినిమా తనకు రీ-ఎంట్రీ ఏమీ కాదంటున్నారామె. ‘‘అందరూ నాకిది రీ-ఎంట్రీ అంటున్నారు కానీ, నా మటుకు నాకైతే సినిమా పరిశ్రమకు దూరమైన ఫీలింగేమీ లేదు. నిజానికి, మధ్యలో ఒక సినిమాకు మణిరత్నం నన్ను ఎంచుకున్నారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌పై మణి సార్ రీ-వర్క్ చేస్తున్నారు. అది అలా ఉండగా, ‘జజ్బా’ ఛాన్స్ వచ్చింది’’ అని ఐశ్వర్యారాయ్ వివరించారు. ‘జజ్బా’ మూస తరహా సినిమా కాదంటున్న ఆమె అందులో వకీలు పాత్ర పోషిస్తున్నారు. సింగిల్ మదర్ అయిన లాయర్, కిడ్నాప్‌కు గురైన ఆమె కుమార్తె కథ ఇది. రానున్న అక్టోబర్‌లో సినిమా విడుదల కానుంది. ఐశ్వర్యారాయ్ వెండితెర దర్శనం కోసం అప్పటి దాకా ఆగాల్సిందే!