ఐశ్వర్యా రాయ్... ఆ ముగ్గురూ నై
కొంతమంది ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతారు. మరికొంతమంది ఎంత కాలం కలిసి పని చేసినా ఉప్పూ నిప్పులాగానే ఉంటారు. ఇందుకు రకరకాల కారణాలు. అసూయ.. ఎక్స్‌ట్రా... ఎక్స్‌ట్రా... బాలీవుడ్‌లో ఇలా ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తించే జాబితా చాలా ఎక్కువ. మాట్లాడుకోవడం సంగతలా ఉంచితే, ఎక్కడైనా తారసపడితే కనీసం పలకరింపుగా కూడా ఈ ముద్దుగుమ్మలు నవ్వుకోరట. ఇక.. ఈ ఆగర్భ శత్రువుల గురించి తెలుసుకుందాం...
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురంటే ఐశ్వర్యా రాయ్‌కి పడదు. వాళ్లే సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ, సోనమ్ కపూర్. ముందుగా సుస్మితా సేన్, ఐష్ గురించి చెప్పాలంటే... వృత్తిపరమైన పోటీ కారణంగా ఈ ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగా మెలగలేదు. మోడలింగ్ డేస్ అప్పుడే వీళ్లిద్దరి మధ్య వైరం మొదలైంది. టాప్ మోడల్ అనిపించుకోవడానికి ఇద్దరూ పోటీపడేవారట. ఆ తర్వాత ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటం పొందే విషయంలో ఈ సుందరీమణులు పోటీపడ్డారు. చివరకు ఆ కిరీటం సుస్మితా గెల్చుకున్నారు. ఆ తర్వాత ‘మిస్ యూనివర్శ్’ కిరీటం కూడా దక్కించుకున్నారామె. ఐష్ ఏమో ‘మిస్ వరల్డ్’ టైటిల్ మాత్రమే గెల్చుకున్నారు. ఈ కిరీటాలే ఈ ఇద్దరి మధ్య నిప్పు రాజేశాయి. సుస్మితా ప్రతిష్ఠాత్మక బిరుదులు సొంతం చేసుకోవడం ఐష్‌కి మింగుడుపడలేదని బాలీవుడ్‌లో చెప్పుకుంటుంటారు. ఏది ఏమైనా 1990లలో మొదలైన వీరి శత్రుత్వానికి ఇప్పటివరకూ ఫుల్‌స్టాప్ పడకపోవడం విశేషం.
ఐష్, రాణీ ముఖర్జీ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారి మనస్పర్థలు నెలకొడానికి కారణం ‘చల్తే చల్తే’ సినిమా. షారూక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ముందు ఐశ్వర్యా రాయ్‌ని నాయికగా తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఐష్ స్థానంలో రాణీ ముఖర్జీని ఎంపిక చేశారు. ఇక, వ్యక్తిగతంగా అభిషేక్ బచ్చన్ విషయంలో ఇద్దరూ శత్రువులయ్యారు. అభిషేక్ బచ్చన్‌తో రాణి డేటింగ్ చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. కానీ, మధ్యలో ఐష్ ఇన్‌వాల్వ్ అయిపోయి, అభిషేక్ బచ్చన్‌తో డేటింగ్ మొదలుపెట్టారట. ఆ విధంగా రాణీతో డేటింగ్‌కి అభిషేక్ రామ్ రామ్ చెప్పేశారట. ఆ తర్వాత అభిషేక్, ఐష్ పెళ్లి చేసుకుని సెటిలవ్వడం తెలిసిందే. కానీ, రాణీ, ఐష్ మధ్య ఉన్న మనస్పర్థలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
ఐశ్వర్యా రాయ్, సుస్మితా, రాణీ ముఖర్జీ.. ఈ ముగ్గురూ అటూ ఇటూగా సమ వయస్కులే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వీళ్ల మధ్య పొరపొచ్ఛాలు రావడం సహజం. కానీ, ఐష్‌కన్నా దాదాపు పదిహేనేళ్లు చిన్నదైన సోనమ్ కపూర్‌తో వైరం ఏర్పడటం విచిత్రం. అయితే, దీనికి పూర్తి బాధ్య సోనమ్‌దే. ఈ ఇద్దరూ ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తలుగా చేశారు. దానికి సంబంధించిన సమావేశంలో ఐశ్వర్యా రాయ్‌ని సోనమ్ ‘ఆంటీ’ అని సంబోధించారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఆంటీ, అంకుల్ అనే పిలుపుని ఇష్టపడరు. సోనమ్ అలా పిలవడం ఐష్ అంగీకరించలేకపోయారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మాటలు కట్.