ఐశ్వర్య లేకుంటే అసిన్
ఐశ్వర్య లేకుంటే అసిన్
Published Wed, Mar 19 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
ఐశ్వర్యరాయ్ కాదంటే తదుపరి ప్రాధాన్యత అసిన్‌కే నంటున్నారు ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం. కడల్ తరువాత ఈయన తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే మార్పులు, చేర్పులు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. మొదట తమిళం, తెలుగు భాషలలో రూపొందించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, నాగార్జున హీరోలుగా నటించే ఈ చిత్రంలో ముఖ్య భూమికను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పోషించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ చిత్రాన్ని మణిరత్నం తొలుత తెలుగులోనే రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కోలీవుడ్‌లో ఫైనాన్స్ సమస్య కారణం అని సమాచారం.
తాజాగా చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా నటించే అవకాశం లేదని తెలుస్తోంది. వివాహానంతరం ఐశ్వర్యారాయ్ మణిరత్నం చిత్రం ద్వారానే రీ ఎంట్రీ కావాలని ఆశించారని, అందుకే ఆయన అడగ్గానే నటించడానికి ఓకే చెప్పారని సమాచారం. ఈ సుందరి మళ్లీ నటించడానికి ఆమె అత్త జయబచ్చన్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వారి కుటుంబంలో మనస్పర్థలు రేగే పరిస్థితులు తలెత్తడంతో ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ మణిరత్నంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. మణిరత్నం ఆమె కోసం మరి కొద్ది కాలం వేచి ఉండడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. అయినా ఐశ్వర్యారాయ్ నటించని పక్షంలో ఆ పాత్రకు నటి అసిన్‌ను ఎంపిక చేయాలని మణిరత్నం నిర్ణయించినట్లు తాజా సమాచారం.
Advertisement
Advertisement