
తమిళసినిమా: నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. ఏ రంగంలోనూ తాము మగవారికి తక్కువ కాదనే విధంగా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇక సినిమా కథానాయికల విషయానికొస్తే ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. ఇంతకు ముందు పాత్రల స్వభావానికి తగ్గట్టుగా మారడానికి హీరోలు మాత్రమే శిక్షణలు, కసరత్తులు చేసేవారు. ఇప్పుడు హీరోయిన్లు అలా పాత్రలకు జీవం పోయడానికి శాయశక్తులా శ్రమిస్తున్నారు. ఆ మధ్య నటి అనుష్క కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి వాటిలో తగిన శిక్షణ పొందిన విషయం తెలిసిందే. సమంత కూడా కర్రసాములో తర్ఫీదు పొందారు. తాజాగా నటి ఐశ్వర్యరాజేశ్ క్రికెట్ క్రీడలో శిక్షణ పొందారట. కాక్కముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుతమైన అభినయాన్ని పలికించి అందరి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యరాజేశ్‌కు ఆ తరువాత మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. దీంతో అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న ఈ అమ్మడు ఆయనతో నటించడం సంతోషంగా ఉందని, విజయ్‌సేతుపతితో మళ్లీ మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని పేర్కొన్నారు. తాజాగా ఒక బలమైన పాత్రలో నటించే అవకాశం ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. అది క్రికెట్ క్రీడాకారిణి పాత్ర కావడం విశేషం. కనా పేరుతో తెరకెక్కితున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌కు కూతురిగా నటిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన దంగల్ చిత్రంలో కుస్తీ పోటీల్లో రాణించాలన్న కోరిక నెరవేరకపోవడంతో తన కలను తన కూతుర్ల ద్వారా నెరవేర్చుకున్న బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ మాదిరిగా కానా చిత్రంలో సత్యరాజ్ క్రికెట్ క్రీడాకారుడిగా రాణించాలన్న తన కలను తన కూతురి ద్వారా నేరవేర్చుకుంటారట. నటి ఐశ్వర్యరాజేశ్‌కు క్రికెట్ గురించి పెద్దగా తెలియదట. కానా చిత్రంలో తన పాత్రలో జీవించడం కోసం ఈమె ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు డేవ్‌వాట్ మోర్ వద్ద శిక్షణ పొందారట. క్రికెట్ క్రీడలో పురుష ఆధిక్యమే సాగుతోంది. ఇప్పుడిప్పుడే మహిళలు ఆ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. అలా కానా చిత్రం మహిళలకు క్రికెట్ క్రీడలో సాధించాలనే ఆసక్తి అధికం అవుతుందనే అభిప్రాయాన్ని చిత్ర వర్గాలు వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment