వీరు దేవగణ్
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్, అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ సోమవారం తుది శ్వాస విడిచారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో వీరు దేవగణ్‌ను ముంబైలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్‌తో చనిపోయారాయన. సోమవారం సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. వీరు దేవగణ్ సుమారు 80 సినిమాలకు పైనే స్టంట్‌మేన్‌గా పని చేశారు. ‘హిందుస్తాన్‌కి కసమ్’ (1999) సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇందులో అమితాబ్ బచ్చన్, వీరు దేవగణ్ కుమారుడు అజయ్ దేవగణ్, మనీషా కొయిరాల నటించారు. ఓ సందర్భంలో తన తండ్రి గురించి అజయ్ మాట్లాడుతూ – ‘‘నా జీవితంలో నిజమైన సింగం (సింహం) మా నాన్నగారే. జేబులో డబ్బులతో కాకుండా కేవలం ఆశలతో ముంబైలో అడుగుపెట్టారు. తినడానికి తిండి కూడా లేకుండా తన గోల్ కోసం కష్టపడ్డారు. స్ట్రీట్ ఫైటర్ అయ్యారు. ఆ తర్వాత యాక్టర్ రవి ఖన్నా మా నాన్నను చూసి సినిమాల్లో పని చేయమని కోరారు. అక్కడి నుంచి ఇండియాలోనే టాప్ యాక్షన్ డైరెక్టర్‌గా నాన్న ఎదిగారు.
ఆయన ఒంట్లో విరగని ఎముక లేదు. తల మీద సుమారు 50 కుట్లుపైనే ఉన్నాయి. అందుకే ఆయనే నా నిజమైన సింగం’’ అని పేర్కొన్నారు. 1970లలో కెరీర్ ఆరంభించిన వీరు దేవగణ్ దాదాపు 80 చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. వాటిలో మిస్టర్ ఇండియా, రామ్ తేరీ గంగా మైలీ, ఇంక్విలాబ్, హిమ్మత్‌వాలా వంటి చిత్రాలు ఉన్నాయి. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి యాక్షన్ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత కూడా తనయుడి సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. వీరు దేవగణ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment