
తమిళనాట తలా రికార్డ్
ఈ దీపావళి పండుగ తమిళ సినీ అభిమానులకు మరింత కిక్ ఇచ్చింది. కోలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు దీపావళి సందర్భంగా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ 'తుంగావనం' సినిమాను రిలీజ్ చేయగా, అజిత్ 'వేదలం'తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో తమిళ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు.
'వేదలం' సినిమాతో అజిత్ సరికొత్త రికార్డును ఆవిష్కరించాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ అందుకు తగ్గట్టుగానే తొలి రోజు కలెక్షన్ల విషయంలో రజనీ, విజయ్ లాంటి టాప్ స్టార్లకు షాకిచ్చాడు. గతంలో విజయం హీరోగా నటించిన 'కత్తి' సినిమా తొలిరోజు 12.5 కోట్ల వసూళ్లు చేయగా, రజనీ కాంత్ హీరోగా నటించిన 'లింగా' సినిమా 12.8 కోట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ రెండు రికార్డులను చెరిపేస్తూ అజిత్ వేదలం సినిమాతో 15.5 కోట్ల తొలి రోజు వసూళ్ల రికార్డ్ను సెట్ చేశాడు.
గతంలో 'వీరం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శివ దర్శకత్వంలో, అజిత్ చేసిన సినిమా కావటంతో పాటు తొలిసారిగా అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించటంతో, ఈ సినిమా రిలీజ్కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు వసూళ్లతోనే సత్తా చాటిన వేదలం మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది.