
అమల క్లాప్, నాగ్ స్విచ్ఛాన్..అఖిల్ ఎంట్రీ..
హైదరాబాద్ : తెలుగు చిత్రసీమకు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అఖిల్ సోలో హీరోగా ఎంట్రీ ఎప్పుడా అని గతకొద్ది రోజులుగా అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . 'సిసింద్రీ'గా... ప్రేక్షకులకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానుంది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అక్కినేని అమల క్లాప్ ఇవ్వగా...నాగార్జున స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం కేవలం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిల్ బుధవారం ట్విట్ చేశాడు.
హీరో నితిన్, తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అఖిల్ పెప్సికో కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైనా 'మౌంటైన్ డ్యూ' డ్రింక్ కోసం తాజాగా యాడ్ చేశాడు. దాంతో సినిమాల్లోకి రాకముందే అఖిల్ తన మార్క్ చూపించుకుంటున్నాడు.
ఈ చిత్రంపై దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ...'అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సినిమా స్క్రిప్టును పూజలో ఉంచాం. ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. అభిమానులు కోరుకునే మాస్, మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి. అఖిల్‌లో మంచి నటుడు ఉన్నాడు' అని అన్నారు.