‘డాక్టర్లు ఎన్ని రోజులని చెప్పార్రా’ అని నాన్న అడిగారు | Akkineni Nageswara Rao and son Akkineni Naga Chaitanya, movie releases worldwide on May 23 | Sakshi
Sakshi News home page

‘డాక్టర్లు ఎన్ని రోజులని చెప్పార్రా’ అని నాన్న అడిగారు

Published Mon, May 19 2014 12:58 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Akkineni Nageswara Rao and son Akkineni Naga Chaitanya, movie releases worldwide on May 23

 నాగార్జున మంచి నటుడు. మంచి నిర్మాత. మంచి వ్యాపారవేత్త. వీటన్నింటినీ మించి... మంచి కొడుకు. ఎంత మంచి కొడుకంటే.. తన తండ్రి అక్కినేని టాపిక్ తెస్తేనే భావోద్వేగానికి లోనైపోయేంత. తండ్రి జ్ఞాపకాల్లో జీవించడం ఆయనకిష్టం. తండ్రి గురించి వినడం ఆయనకిష్టం. తండ్రి గురించి మాట్లాడటం ఆయనకిష్టం. మొత్తంగా తండ్రే ఆయనకు లోకం. కాసేపు ఆయనతో ముచ్చటిస్తే ఇది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఈ నెల 23న తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నాగ్ నటించిన ‘మనం’ చిత్రం విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకుడు. ‘మనం’ ముచ్చట్లు చెప్పడానికి ఆదివారం నాగార్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ‘మనం’ గురించే కాక, తన తండ్రి అక్కినేని చివరి రోజుల్ని ఉద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలివి.
 
 ‘మనం’ సినిమాకు గత ఏడాది మార్చిలో కొబ్బరికాయ కొట్టాం. కానీ... ఆ ఎండల్లో నాన్నను కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే... జూలైలో చల్లబడగానే షూటింగ్ మొదలుపెట్టాం. నాన్నకు ముందే చెప్పేశాను.. ‘నాన్నా.. ఏం ఫర్లేదు... సినిమాను ఏడాది పాటు నిదానంగా తీసుకుందాం. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చేసేసి వెళ్లిపోండి’ అని. అలాగే వచ్చి చేసి వెళ్లిపోయేవారు. ఎందుకో తెలీదు కానీ... గత ఏడాది ఆయన 90వ పుట్టిన రోజుని మిత్రులు, శ్రేయోభిలాషులందరినీ పిలిపించుకొని మరీ చేసుకున్నారు.
 
 చెన్నయ్, యూఎస్, లండన్... ఇలా దేశవిదేశాల నుంచి కూడా వచ్చారు. వాళ్లందరి సమక్షంలో పుట్టినరోజును జరుపుకోవాలని నాన్నకు ఎందుకు అనిపించిందో!సెప్టెంబర్ 30... మా కుటుంబానికి అదో దుర్దినం. ఎందుకంటే... నాన్నకు తొలిసారి కడుపు నొప్పి వచ్చింది ఆ రోజే. నాన్న అప్పుడు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నారు. ‘ఇంటికెళ్లండి నాన్నా... తర్వాత చూసుకుందాం’ అని పంపించేశాను. అయినా హాస్పిటల్‌కెళ్లి చూపించుకున్నారు. ‘ఎసిడిటీ’ అన్నారు. యాంటాసిడ్ ఇస్తే తగ్గిపోయింది. అసలు నాన్నకు ఎసిడిటీ అనేది ఎన్నడూ లేదు. అంత హెల్దీగా ఉండేవారు.
 
 అక్టోబర్ 10... నాన్నకు మళ్లీ కడుపులో నొప్పి వచ్చింది. ఈ దఫా తీవ్రంగా. స్కాన్ చేస్తే... చిన్న ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. దాన్ని డాక్టర్లు తొలగించేశారు. మళ్లీ నాన్న పర్‌ఫెక్ట్. అయితే... ఆ ట్యూమర్‌ని బయాప్సీకి పంపినప్పుడు అసలు విషయం బయటపడింది. నాన్నకు ‘కేన్సర్’. ఇంట్లో అందరి గుండె ఆగినంత పనైంది. తక్షణ కర్తవ్యం ఏంటని డాక్టర్లను అడిగాం. ‘ఓపెన్ చేస్తే కానీ చెప్పలేం. కానీ ఓపెన్ చేయడానికి ఆయన వయసు సహకరించదు’ అనేశారు. మేం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే.. ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే... ఫోన్లు చేసి ఏడవడం, ఇంకొందరైతే... ‘సార్... మీరు బాగున్నారా?’ అనడగడం. నాన్నకు విసుగొచ్చేసింది. ఇది ఆగాలంటే.. ఉన్న విషయం చెప్పేయడమే మంచిదని భావించారు.
 
 అక్టోబర్ 19... నాన్న ప్రెస్‌మీట్ పెట్టారు. అంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అదే రోజు... ‘మనం’ షూటింగ్‌లో పాల్గొన్నారు. శ్రీయతో నా సీన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారిగా... కడుపు పట్టుకొని పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. స్కాన్ తీశారు. అప్పుడు తెలిసింది.. ట్యూమర్ పెరిగిపోయి.. జీర్ణాశయాన్ని మెలిపెట్టేసిందని, ఆ ప్రాంతమంతా బిగుసుకుపోవడంతో ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడంలేదని. ఇక ఎంత పవర్‌ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నాన్నకు నొప్పి ఆగడంలేదు. సర్జరీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు. నాన్న మొండి మనిషి. ‘చేసేయండి’ అన్నారు. కడుపుని ఓపెన్ చేశారు. అది కడుపంతా స్ప్రెడ్ అయిపోవడం గమనించారు. అయినా సరే.. సర్జరీ చేసేశారు. పెద్ద సర్జరీ. అయినా తట్టుకున్నారు. రెండ్రోజుల్లోనే లేచి తిరిగారు కూడా.
 
 ఓ రోజు సర్జరీ చేసిన డాక్టర్లందర్నీ ఇంటికి పిలిపించారు నాన్న. ‘నన్ను ఓపెన్ చేశారు. లోపల ఏముందో మీ అందరికీ తెలుసు. అబద్ధం చెప్పొద్దు. నిజం చెప్పండి’ అని సూటిగా అడిగారు. నాన్నతో వాళ్లు అబద్ధం చెప్పలేకపోయారు. ‘మీకు కావాల్సినవన్నీ తినండి. సాధ్యమైనంతవరకూ ఆనందంగా ఉండండి. అంతకు మించి ఏం చెప్పలేం’ అనేశారు. ఇక వాళ్లను పంపించేసి, మమ్మల్ని పిలిపించారు నాన్న. ‘ఎన్ని రోజులు అని చెప్పార్రా’ అనడిగారు. నాన్న అబద్ధం చెబితే అస్సలు ఊరుకోరు. ఆయన దగ్గర ఉన్నదున్నట్లు చెప్పేయాలి. అందుకే... ‘ఏమో నాన్న.. ఇన్ని రోజులనేం చెప్పలేదు. మమ్మల్ని మాత్రం ఎక్కువ సమయం మీతోనే గడపమన్నారు’ అని చెప్పేశాం. ఆ రోజే అందర్నీ భోజనాలకు పిలుస్తూ... ‘ఏడుస్తూ వచ్చేటట్లయితే... ఎవరూ నా ఇంటికి రావొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇక ఆ రోజు నుంచి మాతో కబుర్లు చెబుతూ హ్యాపీగా గడిపారు నాన్న. కేన్సరేమో... ఆయన్ను లోలోపల నిదానంగా తినేస్తోంది.
 
 ఓ రోజు నాన్న నన్ను పిలిచి... ‘మనం’లో నా వర్క్ ఎన్ని రోజులుంది అనడిగారు. మీరు ఆర్రోజులొస్తే సరిపోతుందని చెప్పాను. సీన్స్ అన్నీ తెప్పించుకొని చూశారు. ‘ఫస్ట్ క్లైమాక్స్ ఫినిష్ చేయ్’ అన్నారు. సినిమా పూర్తవ్వాలంటే... క్లైమాక్స్ పూర్తి చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది నాన్నకు బాగా తెలుసు. తర్వాత ఏయే సీన్స్ తీయాలో కూడా వివరించి చెప్పారు. ‘ఆర్టిస్టులందర్నీ రెడీ చేసి పెట్టుకో... ఏదో ఒకరోజు నేనొచ్చి చేసేసి వెళ్లిపోతా’ అని చెప్పారు. అన్నట్లుగానే... ముందు క్లైమాక్స్ కంప్లీట్ చేసేశారు. తర్వాత నిదానంగా మిగిలిన సీన్స్ పూర్తి చేశారు. ‘మనం’ ట్రైలర్‌లో లాస్ట్ షాట్ మీరు చూసే ఉంటారు. నాన్నపై తీసిన లాస్ట్ షాట్ కూడా అదే. ఆ షాట్‌లో ఆయన నవ్వు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో.
 
 జనవరి 14... అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైన రోజు. ఆ రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు నాన్న. వర్కర్లందర్నీ పిలిచి వాళ్లతో పాటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అయితే... ఈ దఫా నాన్న రాలేరు అనుకున్నాను. కానీ.. వీల్ ఛెయిర్‌లో స్టూడియోకి వచ్చారు. ఉద్యోగులందర్నీ పేరుపేరునా పలకరిచారు. సాయంత్రం మా అందర్నీ ఇంటికి పిలిచారు. ‘నా జీవితం అందమైందిరా.. చేయాల్సినవన్నీ చేసేశాను’ అని సంబరపడిపోయారు.
 
 క్రమంగా నాన్న ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కిమ్స్ డాక్టర్లు చెప్పారు... ‘రెండు వారాల్లో ఆయనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రిపేర్ అయిపోండి. హాస్పిటల్‌కి తీసుకొచ్చినా వేస్ట్. మేం సర్జరీలు కూడా చేయలేం. పెయిన్ మెడికేషన్ ఇంట్లో రెడీగా పెట్టుకోండి’ అని. పెయిన్ మెడికేషన్ ఇచ్చిన మనిషి చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే... అలా నిద్రలో ఉండిపోతాడంతే. చేసేది లేక డాక్టర్ల మాట పాటించాం.
 
 జనవరి 21... రాత్రి మా ఫ్యామిలీ మొత్తం నాన్నతోనే ఉన్నాం. భోజనాలు చేశాం. అందరికీ నాన్న ‘గుడ్‌బై’ చెప్పారు. నిద్ర వస్తోందని లోపలకెళ్లి పడుకున్నారు. నేను పదింటివరకూ అక్కడే ఉన్నాను. ఇంటికెళ్లేముందు నాన్నను ఓసారి చూసి వెళదామని గదిలోకి వెళ్లాను. గురక పెడుతున్నారు. సరే... వెళ్లబోయాను. ఇంతలో నర్స్ ‘అదేంటిసార్... నాన్నకు గుడ్ నైట్ చెప్పకుండా వెళ్లిపోతారా?’ అంది. ‘నాన్న... నాన్న’ అని తట్టాను. నాన్న లేచారు. ‘గుడ్‌నైట్ నాన్నా’ అన్నాను. ‘సరే... వెళ్లు. రేపు కలుద్దాం’ అని నిద్రలోకి జారుకున్నారు.
 
 నిద్రలోనే....
 నిజంగా నాన్నది అద్భుతమైన జీవితం. ఒక మనిషి ఎంత సాధించగలడో అంతా సాధించారు. అందుకే... ఆయన ధన్యజీవి.
 
 ‘మనం’ మీకు చాలా ప్రత్యేకమైన సినిమా కదా?
 కచ్చితంగా. నా కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ సినిమా. శివ, గీతాంజలి విడుదలై పాతికేళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు నా కెరీర్‌లో రాబోతున్న మరో మైలురాయి ‘మనం’. నాకే కాదు, నా కుటుంబం మొత్తం ప్రేమించి ఈ సినిమా చేశాం. ఆడుతుందా, ఆడదా అనే విషయాలు మేం ఆలోచించలేదు. ‘ఇలా చేద్దాం’ అనుకున్నాం.. చేసేశాం. తెరపై కూడా చైతూ నాకు కొడుకే. నాన్న వాడికి తాతే. ఈ మధ్యకాలంలో నాకు సూట్ అయ్యే పాత్రలు నేను చేయలేదు. ఇన్నాళ్లకు నాకు తగ్గ పాత్రను ‘మనం’లో చేశాను.  మొన్నే అందరం చూసుకున్నాం. అద్భుతంగా అనిపించింది.
 
 ఇందులో అమితాబ్ కూడా నటించారు కదా. ఆ విషయం నాన్నగారికి తెలుసా?
 ఆయనకు తెలీదండీ... నాన్న మనకు దూరమైన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. నాన్నకు అమితాబ్‌గారంటే చాలా ఇష్టం. ఆయన నటనను ఎప్పుడూ పొగుడుతుండేవారు. అందుకే... ఈ సినిమాలో ఆయనతో కూడా నటింపజేయాలనిపించింది. ‘నాన్న చివరి సినిమాలో మీరూ నటిస్తే బావుంటుంది’ అని స్వయంగా ఆయన్ను అడిగాను. ‘మూడు జనరేషన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని... అన్నమాట ప్రకారం వచ్చి నటించారు. ఇందులో ఆయనది చాలా చిన్న వేషం.
 
 మీ నాన్నగారి పాటను ఇందులో రీమిక్స్ చేశారట కదా?
 ‘ప్రేమనగర్’లోని ‘నేను పుట్టాను...’ పాటను రీమిక్స్ చేశాం. ఇందులో ముగ్గురం నటించాం.
 
 మణిరత్నం సినిమా సంగతేంటి?
 చర్చలు జరిగాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. మొన్ననే ‘గీతాంజలి’కి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పా. ఆ సినిమాకు పాతికేళ్లు వచ్చినట్లు ఆయనకు తెలీదంట.
 
 ఎన్టీఆర్, మీరూ కలిసి చేస్తున్నారట?
 అవును... పీవీపీవాళ్లు తీస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది.
 
 చిత్ర పరిశ్రమ వైజాగ్‌లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం. మరి అక్కడ స్టూడియో కట్టాలనే యోచన ఏమైనా ఉందా?
 1974లో నాన్న స్టూడియో కట్టారు. అయినా... చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి పూర్తి స్థాయిలో పరిశ్రమ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్సర్లు కావాలన్నా, మ్యూజిషియన్లు కావాలన్నా చెన్నయ్‌నే ఆశ్రయించాల్సిన పరిస్థితి. మన తెలుగునేలపై చదువుపై చూపించే శ్రద్ధ కళలపై చూపించరు. కానీ తమిళనాడు, కేరళలలో విద్యావంతులు ఎంత ఎక్కువగా ఉంటారో, కళాకారులు కూడా అంతే ఉంటారు. అందుకే... ఇప్పటికీ కళాకారుల్ని మనం అక్కడ్నుంచే తెచ్చుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థమైందేంటంటే... స్టూడియో అని ఓ నాలుగు గోడలు కడితే సరిపోదు. ముందు ఒక వ్యవస్థ అక్కడ క్రియేట్ అవ్వాలి.
 
 అసలు పరిశ్రమ వైజాగ్ వెళ్లే అవసరం ఉందంటారా?
 అసలక్కడ పాలనా వ్యవస్థే లేదు. స్టూడియోలకి తొందరెందుకు?

 మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఏదైనా స్మారక చిహ్నం ఏర్పాటు చేసే ఆలోచన ...
 ఉందండీ... అమ్మ, నాన్న ఇద్దరి పేరిటా చేయాలి. నాన్న మ్యూజియం కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మ్యూజియం అంటే నాన్నకు చాలా ఇష్టం. స్టూడియోలోనే... సరైన స్పాట్ చూసి ఆ కార్యక్రమాలు మొదలుపెడతాం. నాన్న పేరిట ప్రతి ఏడాదీ ఇచ్చే అవార్డును కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement