‘మనం’తో ఏయన్నార్ మళ్లీ బిజీ
ఆత్మస్థయిర్యానికి చిరునామా ఏయన్నార్ అని... ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. అప్పట్లో మొదటిసారి ఏయన్నార్‌కి శస్త్రచికిత్స జరిగింది. పధ్నాలుగేళ్లు మీ లైఫ్‌కి గ్యారంటీ అన్నారు డాక్టర్లు. ఇది జరిగి 39 ఏళ్లయ్యింది. ఇప్పుడు తొమ్మిది పదుల వయసులో ఒక్క పన్ను కూడా ఊడకుండా, కంఠస్వరంలో ఏమాత్రం తేడా లేకుండా... ఎంతో చలాకీగా ఉన్నారు అక్కినేని. కానీ, ఇటీవల కేన్సర్ కణాలు ఉన్నాయని, కానీ భయపడాల్సిన అవసరమేం లేదని ఆయన ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా, చాలామంది బాధపడ్డారు.
ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని విని కలవరపడ్డారు. ప్రస్తుతం అక్కినేని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే తపన ఆయన అభిమానులనే కాకుండా, చాలామందిలో ఉంది. అయితే, అక్కినేని ఈజ్ బ్యాక్ టు షూటింగ్. ఆయన హ్యాపీగా ‘మనం’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ముద్దుల మనవడు, హీరో సుమంత్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అక్కినేని, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మనం’పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.