బాలీవుడ్ 'శ్రీమంతుడు'
సినీ తారలు ఏదో ఒక రూపంలో తమ పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నారు. టాలీవుడ్లో శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు, శృతిహాసన్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లాంటి వారు గ్రామాలను దత్తత తీసుకోగా, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సామాజిక కార్యక్రమాల మీద దృష్టిపెడుతున్నారు.
ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ రైతులకు తనవంతు సాయం అందించగా, తాజాగా యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా లిస్ట్లో చేరిపోయాడు. మరాఠావాడ రీజియన్లో కరువు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 180 రైతు కుటుంబాలను ఆదుకుంనేందుకు ముందుకు వచ్చాడు అక్షయ్. వీరి కోసం ఇప్పటికే 90 లక్షల రూపాయాలను డోనేట్ చేసిన ఈ రియల్ హీరో, ఈ విషయం పై స్పందిచడానికి మాత్రం నిరాకరించాడు.
ఈ విషయంలో తనకు ప్రచారం అవసరం లేదన్న అక్షయ్ కుమార్, మీడియా వార్తల ద్వారా మరింత మంది ఇలా స్పందిచేలా ప్రయత్నించాలని కోరాడు. నానా పటేకర్, అక్షయ్ కుమార్లు చూపించిన ఇదే బాటలో నడిచేందుకు మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రెడీ అవుతున్నారు.