
నా హీరోలు పోరాడేది అందుకే !
తమిళనాట క్రేజీ దర్శకుడిగా పేరొందిన ఏ.ఆర్. మురుగదాస్ ఇప్పుడు తన తాజా హిందీ చిత్రం ‘హాలీడే’ విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘తుపాకీ’కి రీమేక్ అయిన
తమిళనాట క్రేజీ దర్శకుడిగా పేరొందిన ఏ.ఆర్. మురుగదాస్ ఇప్పుడు తన తాజా హిందీ చిత్రం ‘హాలీడే’ విడుదల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘తుపాకీ’కి రీమేక్ అయిన ఈ సినిమా హిందీలోనూ తనకు పేరు తెస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ‘‘తమిళ ఒరిజినల్ ‘తుపాకి’ లాగానే, హిందీ ‘హాలీడే’ కూడా విజయం సాధిస్తుందనీ, నాకు పేరు తెస్తుందనీ నమ్ముతున్నా’’ అన్నారాయన. గతంలో ‘గజిని’ హిందీ రీమేక్‌ను ఆమిర్ ఖాన్‌తో తీసిన మురుగదాస్ ఇప్పుడీ రీమేక్‌ను అక్షయ్ కుమార్‌తో రూపొందించారు. ‘‘ఆమిర్ పూర్తిగా పని మీదే దృష్టి పెట్టే నటుడు. పని తప్ప మరో ధ్యాస లేని వ్యక్తి. అక్షయ్ విషయానికి వస్తే, అతనూ సిన్సియర్‌గా పని చేస్తారు.
కానీ, నవ్వుతూ, తుళ్ళుతూ, ఒత్తిడికి లోనవకుండా ఉంటారు. పైగా, అంత పెద్ద నటుడైనా వినయంగా ఉంటారు. తన సిబ్బందిని చక్కగా చూసుకుంటారు’’ అంటూ ఈ దర్శకుడు అక్షయ్ కుమార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడులోని కళ్ళకురిచ్చి అనే ఓ చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఏడుగురు పిల్లల్లో ఒకడిగా కష్టపడి పెరిగి, పైకొచ్చిన నేపథ్యం ఆయనది. ఓ ప్రముఖ తమిళ రచయిత దగ్గర సహాయకుడిగా డజనుకు పైగా చిత్రాలకు పనిచేసి, స్క్రిప్టు రచనలో పట్లు తెలుసుకున్న మురుగదాస్ ఇప్పటికీ ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. రూమ్‌మేట్ ఉదయ్ శంకర్ దగ్గర, దర్శకుడు ఎస్.జె. సూర్య దగ్గర సగం సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి, 2001లో దర్శకుడైన ఆయన వరుస హిట్లతో కొనసాగుతున్నారు.
సినిమాల్లో తన హీరోలు కొంత దూకుడుగా కనిపిస్తూ, సమాజంలోని అన్యాయాలపై పోరాడడానికి కారణమేమిటన్నదానికి మురుగదాస్ వివరణనిచ్చారు. ‘‘మొదటి నుంచి సమాజంలోని అన్యాయాలు, అక్రమాలపై నాకు ఆగ్రహం ఉండేది. నిజజీవితంలో నేను చూసిన సంఘటనలు, నాకు ఎదురైన అనుభవాలే అందుకు కారణం. కానీ, చివరకు మా నాన్న గారి డెత్ సర్టిఫికెట్‌కి కూడా లంచం ఇవ్వనని ఎదురుతిరిగి, ఇబ్బందులు ఎదుర్కొన్నా. నిజజీవితంలో నేను అన్నింటికీ అందరితోనూ పోరాడలేను. అందుకే, నా సినిమా కథలు, అందులోని హీరో పాత్రలు అక్రమాలపై పోరాటం సాగిస్తాయి’’ అని చెప్పారు. జీవితానికి దగ్గరగా ఉండే ఆ పాత్రలు, సంఘటనలే ఆయన సినిమాల విజయరహస్యమేమో!