
తమిళసినిమా: పూర్తిగా అడవుల్లో చిత్రీకరణను జరుపుకున్న చిత్రం మరగధకాడు అని ఆ చిత్ర దర్శకుడు మంగళేశ్వరన్ తెలిపారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌ఆర్.ఫిలింస్ పతాకంపై రఘునాథన్ నిర్మిస్తున్నారు. అజయ్, రంజనా, జయశ్రీ,మలయాళ దర్శకుడు ఇలియాస్ కాత్తవన్, జేపీ.మోహన్, పావాలక్ష్మణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయప్రకాశ్ సంగీతాన్ని, నక్షత్ర ప్రకాశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా అడవుల్లో చిత్రీకరించిన మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. నానాటికి నశించి పోతున్న అడవులు, వాటిని నమ్ముకుని జీవించే అటవీవాసుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా మరగధకాడు చిత్రం ఉంటుందన్నారు. నాగరికత, నగరాభివృద్ధి పేరుతో అడవులను ఎలా హరింపజేస్తున్నారు? దాని వల్ల ప్రకృతి ఎలా బాధింపునకు గురవుతోంది? అన్న అంశాలను ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు.
ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నట్లే ఇకపై గాలిని కొనుక్కునే పరిస్థితి రాకుడదని చెప్పే చిత్రంగా మరగథకాడు చిత్రం ఉంటుందన్నారు. ఇందులో ఒక చక్కని ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. ఒక పరిశోధన నిమిత్తం అడవికి వెళ్లిన కథానాయకుడికి అక్కడ ఒక అందమైన అమ్మాయి తారస పడుతుందన్నారు. వారి పరిచయం ప్రేమగా మారగా,అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఆసక్తికరమైన సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం మరగధకాడు అని చెప్పారు. చిత్రాన్ని తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment