వైశాఖం నా జీవితంలోంచి వచ్చిన సినిమా! | "All the films we've produced so far have been created for the film. | Sakshi
Sakshi News home page

వైశాఖం నా జీవితంలోంచి వచ్చిన సినిమా!

Published Tue, Jul 25 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

వైశాఖం  నా జీవితంలోంచి  వచ్చిన సినిమా!

వైశాఖం నా జీవితంలోంచి వచ్చిన సినిమా!

ఇప్పటివరకు మేం తీసిన సినిమాల కథలన్నీ సినిమా కోసం సృష్టించినవి. కానీ, ‘వైశాఖం’ అలా కాదు. నా జీవితంలోంచి వచ్చిన సినిమా. కొన్నేళ్ల క్రితం నా లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన చుట్టూ రాసుకున్న కథ ఇది’’ అన్నారు జయ బి. ఆమె దర్శకత్వంలో హరీశ్, అవంతిక ‘వైశాఖం’ హరీశ్, జంటగా బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రకథకు కీలకంగా నిలిచిన ఇన్సిడెంట్‌ గురించి, ఇతర విశేషాలను జయ ఈ విధంగా పంచుకున్నారు.

ఆ ముద్దు సీన్‌ గురించి ఎవరికీ చెప్పలేదు
కొన్ని సీన్స్‌ తీసేటప్పుడు యూనిట్‌ మొత్తానికి చెబితే, అలర్ట్‌ అయిపోయి పని మీద సరిగ్గా దృష్టి పెట్టరు. ఉదాహరణకు ఈ సినిమాలో ఓ కిస్సింగ్‌ సీన్‌ ఉంది. హీరో, హీరోయిన్, కెమెరామేన్, నాకు, రాజుగారికి మాత్రమే ఆ సీన్‌ తీయబోతున్నామని తెలుసు. సీన్‌లో భాగంగా మాట్లాడుకుంటూ.. హఠాత్తుగా హీరోని హీరోయిన్‌ ముద్దు పెట్టుకుంటుంది. దాంతో నిజంగానే ఇద్దరూ లవ్‌లో పడ్డారేమోనని యూనిట్‌ సభ్యులనుకున్నారు. నేను ‘షాట్‌ ఓకే’ అనగానే, సినిమా కోసమే అలా చేశారని అందరికీ అర్థమైంది.

అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘వైశాఖం’ తీయాలని ఎందుకు అనిపించింది?
►  ఆ మధ్య రాజోలు దగ్గర మా ఊరు వెళ్లినప్పుడు అపార్ట్‌మెంట్లు కనిపించడం చూసి, షాకయ్యాను. ఈ కల్చర్‌ కరెక్ట్‌ కాదనడంలేదు కానీ, కరెక్టయిన వ్యక్తులు ఉన్నప్పుడే అపార్ట్‌మెంట్‌ లైఫ్‌ బాగుం టుంది. లేకపోతే మంచివాళ్లు ఇబ్బందులు పడతారు. అదే ఈ సినిమాలో చూపించాం. లవ్, కామెడీ, సెంటిమెంట్‌.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా తీశాం.

► కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఈ చిత్రకథకు మూలం అన్నారు.. ఏంటా ఇన్సిడెంట్‌?
అమ్మానాన్నా.. నేను, నా ఇద్దరు చెల్లెళ్లు ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. టైమ్‌ ప్రకారం నీళ్లు వదిలేవాళ్లు. నాన్నగారు హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయినప్పుడు ఇంటి నిండా బంధువులు. అంతిమ క్రియలు జరుపుతున్న సమయంలో వాటర్‌ లేదు. అడిగితే, టైమ్‌ ప్రకారమే వదులుతామన్నారు. ఇంటి పెద్ద పోయిన బాధలో ఉన్న మమ్మల్ని ఊరడించాల్సింది పోయి రూల్స్‌ మాట్లాడారు. ఆ రోజు మేం పడిన బాధను మరచిపోలేను. ఇప్పటివరకూ ఏ సినిమా తీసినా నా మనసులో ఉండిపోయిన ఆ బాధతో సినిమా చేయాలనే ఆలోచన వెంటాడేది.

►  మీ నాన్నగారి గురించి...
నేను డైరెక్టర్‌ అయ్యానంటే కారణం ఆయనే. నాన్న (గొట్టిముక్కల నరసింహరాజు) గారికి డైరెక్టర్‌ అవ్వాలని ఉండేది. కానీ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయారు. నాకు జర్నలిజమ్‌ అంటే ఇంట్రస్ట్‌. చెన్నై యూనివర్శిటీలో జర్నలిజమ్‌లో డిప్లొమా చేశాను. ఆ తర్వాత ‘సూపర్‌ హిట్‌’ పత్రిక పెట్టి, సక్సెస్‌ అయ్యాం. నాన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే డైరెక్టర్‌ అయ్యాను. ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటనతో ‘వైశాఖం’ తీసి, మా అమ్మగారికి అంకితం ఇచ్చాను. ఈ సినిమా చూసి, మా అమ్మగారు ఎమోషన్‌ అయ్యారు. మంచి సినిమా తీశావని అభినందించారు.

► క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా అనిపించింది.. రమాప్రభగారు ఆ సీన్స్‌లో చేయడానికి  ఒప్పుకున్నారా?
రమాప్రభగారికి కథ చెప్పినప్పుడు చనిపోయినట్లు చూపించడంతో పాటు అంత్య క్రియలు చేస్తున్నట్లు చూపిస్తా మంటే, ఆమె ఒప్పుకున్నారు. ఆ సీన్‌ తీసిన రోజు ఆమెకు 104 ఫీవర్‌. ఆ సీన్‌ సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఆమెకు తెలుసు. అందుకే చేశారు. అద్భుతంగా నటించారు. సాయికుమార్‌గారు ఫైర్‌ ఆఫీసర్‌గా చేయడం ఓ ప్లస్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన గురించి, క్లైమాక్స్‌ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎమోషనల్‌గా ఉందని చెమర్చిన కళ్లతో అంటున్నారు. ఇన్నేళ్లుగా నన్ను వెంటాడిన సంఘటనను సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూపించడం, దాన్ని అందరూ అభినందించడం హ్యాపీగా ఉంది. అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్న కుటుంబాలు కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పిన మెసేజ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement