పెరంబూరు : నడిగర్ సంఘంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయని ఆ సంఘ సభ్యులు సంఘ రిజిస్ట్రార్ శాఖకు, రాష్ట్రర సచివాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికల జరిగినా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగలేదు. ఓట్ల లెక్కింపు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈ నెల 15వ తేదీన వెల్లడించనున్నట్లు చెన్నై హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సంఘాల శాఖ నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లకు నోటీసులు జారీ చేసింది.
అందులో సంఘనిర్వాక విధులను సరిగా నిర్వహించలేదని తెలిసిందని, దీంతో తామే ప్రత్యేక అధికారితో ఎందుకు సంఘ బాధ్యతలు నిర్వహించారాదు? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు నడిగర్‌సంఘం సభ్యులను ధిగ్భ్రాంతికి గురి చేసింది. వారు సంఘాల శాఖ అధికారికి, రాష్ట్ర సచివాలయానికి ఒక లేఖ రాశారు. అందులో తమకు నోటీసులు, పత్రికల్లో వెలువడ్డ వార్త దిగ్భ్రాంతిని, మనస్థాపాన్ని కలిగించాయన్నారు. సంఘంలో చాలా కాలంగా పొందని పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ మూడేళ్లలో తాము పొందుతున్నామన్నారు. ముఖ్యంగా విశ్రాంత నటీ, నటులకు వృద్ధాప్య భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ఫలితాలు వెలువడక పోయినా అందిస్తోందని చెప్పారు. అలాంటిది కొందరు కావాలనే ఉసుగొల్పి, ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. సంఘ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎన్నికలను రద్దు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు అయినా ఎలాంటి అవరోధాలు లేకుండా సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. అలాంటిది సంఘానికి చేటు వాటిల్లేలా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించరాదన్న నోటీసులు సంఘంలోని 80 శాతం సభ్యులను బాధించాయన్నారు. 200 మంది వరకూ లేఖలో సంతకాలు చేసి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment