లడ్డుబాబు మేకప్‌కే నాలుగున్నర గంటలు!
కమల్‌హాసన్‌లా ప్రయోగాలు చేయడానికి, పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా భరించడానికి అల్లరి నరేశ్ సిద్ధమయ్యారు. లడ్డుబాబుగా ఆయన గెటప్ చూసి... ఆశ్చర్యపోనివారు ఎవరూ ఉండరు. స్లిమ్ బోయ్‌గా ఉండే నరేశ్... ఫ్యాటీ బోయ్‌గా కనపడటం కోసం చాలా కష్టాలే పడ్డారు. అదీ చాలా ఇష్టంగా! ఇదంతా దర్శకుడు రవిబాబు క్రియేషన్. త్రిపురనేని రాజేంద్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో లడ్డుబాబుగా కనిపించడం కోసం అల్లరి నరేశ్ నాలుగున్నర గంటల ముందే స్పాట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆడియో ఫంక్షన్ కోసమే ఇంత కష్టపడితే, ఈ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లూ అల్లరి నరేశ్ ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించుకోండి.
అసలు ఈ గెటప్ పూర్వాపరాల విషయానికొస్తే...
31 కిలోల బరువున్న మేకప్ మెటీరియల్: లండన్‌కి చెందిన ప్రముఖ మేకప్‌మేన్ మైక్ ఈ గెటప్‌ను సిలికాన్ మెటీరియల్‌తో తయారుచేశారు. ముంబయ్‌కి చెందిన మేకప్ ఉమెన్ ప్రీతి కూడా ఈ గెటప్ విషయంలో సహకరించారు. సిలికాన్ మెటీరియల్ సహాయంతో నరేశ్ స్కిన్‌టోన్‌కి తగ్గట్టుగా కాళ్లు, చేతులు, బాడీ, ఫేస్ పార్టులను తయారు చేశారు. ఇవన్నీ నరేశ్ శరీరానికి అమర్చడానికి పట్టే సమయం నాలుగున్నర గంటలు. ఇక వీటి బరువు విషయానికొస్తే... కాళ్లు 8 కిలోలు. రెండు చేతులు కలిపి 4 కిలోలు. బాడీ 13 కిలోలు, ముఖానికి సంబంధించిన మెటీరియల్ 2 కిలోలు, కేవలం ప్యాంట్ 4 కిలోలు. మొత్తం 31 కిలోలు. షూటింగ్ గంటల తరబడి జరిగేది. జరిగినంతసేపూ ఈ బరువును మోస్తూనే ఉండాలి. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఇదే పరిస్థితి.
దురద పుట్టినా గోక్కోవడం కుదరదు: కడుపునిండా తిన్న తర్వాతే మేకప్ వేసుకోవాలి. ఎందుకంటే... మేకప్ పూర్తయ్యాక తినడం కుదరదు. టీ, కాఫీ, వాటర్, జ్యూస్.. ఇవే ఆహారం. ఒక్కసారి గెటప్ సెట్ చేశాక... ఇక బాడీలోకి ఎక్కడా గాలి ప్రవేశించే అవకాశం ఉండదు. చివరకు దురద పుట్టినా గోక్కోవడం కుదరదు. అందుకే తలకు అడుగు దూరంలో 30 టన్నుల ఏసీ మిషన్ ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇంత కష్టాన్ని భరిస్తూ... కొన్ని నెలల పాటు షూటింగ్ చేసిన నరేశ్‌ని నిజంగా అభినందించాల్సిందే!