విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్, ‘అల్లరి’ నరేశ్, ప్రసాద్ వి.పొట్లూరి, వెంకటేశ్, పూజాహెగ్డే, మహేశ్‌బాబు, కేయూ మోహనన్, వంశీ పైడిపల్లి, ‘దిల్’ రాజు
‘‘ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేశ్‌బాబు. ‘మహర్షి’ ట్రైలర్ చూశారు కదా.. అదిరిపోయింది కదా. 25వ సినిమా అయినా వయసు 25లానే ఉన్నాడు మహేశ్. ప్రతి ఆర్టిస్ట్‌కి కెమేరా ఫేవర్ యాంగిల్ ఒకటుంటుంది. మహేశ్‌కు మాత్రం 360 డిగ్రీస్ ఎక్కడ పెట్టినా అందంగానే కనిపిస్తాడు. అందుకే సింగపూర్‌లో తన మైనపుబొమ్మ పెట్టారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా, ‘అల్లరి’ నరేష్ కీలక పాత్రలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్’ రాజు, సి.అశ్వినీదత్, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్‌లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మహర్షి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. చిన్నోడు నా మీద కోపంగా పూలకుండీ తన్నాడు. ఆ సినిమా (సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు) ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మీకు తెలుసు. ఈ సినిమాతో మళ్లీ అన్ని రికార్డులను తన్నేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా అన్నయ్య వెంకటేశ్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏ సెట్‌కి వెళ్లినా, ఏ ఫంక్షన్‌కి వచ్చినా సినిమా సూపర్‌హిట్ అంటుంటారు.. అది పెద్ద సెంటిమెంట్. ఇక్కడికొచ్చినందుకు థ్యాంక్స్ సర్. యంగర్ జనరేషన్ హీరోల్లో నేను అభిమానించేది విజయ్ దేవరకొండని. తన పనిని నేను ఇష్టపడతాను. ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు. ‘రాజకుమారుడు’తో నన్ను పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా.
నేను యాక్ట్ చేయగలను అని నిరూపించిన సినిమా ‘మురారి’. ఇందుకు కృష్ణవంశీగారికి థ్యాంక్స్. నన్ను స్టార్‌ని చేసిన సినిమా ‘ఒక్కడు’. థ్యాంక్యూ వెరీమచ్ గుణశేఖర్ సార్. నన్ను కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా ‘అతడు’. ఇందుకు త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ‘దూకుడు’.. దానికి శ్రీను వైట్లగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’తో రెండుసార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ సార్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు ‘మహర్షి’ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ సినిమా 20 నిమిషాల కథ వినగానే రెండు సినిమాల తర్వాత ఈ సినిమా చేయాల్సి వస్తుందన్నాను.
పర్లేదు సార్... రెండేళ్లైనా మీకోసం వేచి చూస్తాను, మీరు తప్ప ఈ కథలో నేనెవర్నీ ఊహించలేదు అన్నాడు. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ వద్ద కథ ఉన్నా రెండు నెలలు ఆలస్యమైతే వేరే హీరోల వద్దకు వెళ్లిపోతారు. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్లు చేయాలని నా ఫీలింగ్. యాక్టర్ యాక్టింగ్ చేయాలి.. డైరెక్టర్ డైరెక్షనే చేయాలి. ఈ 25 సినిమాల జర్నీ, ఈ 20 ఏళ్ల జర్నీలో మీరు (అభిమానులు) చూపించిన ప్రేమ, అభిమానానికి మాటలు రావడం లేదు.. చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ అభిమానం, ప్రేమ ఇంకో పాతిక సినిమాలు, ఇంకో ఇరవై ఏళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘ఆనాటి ‘అగ్నిపర్వతం’ నుంచి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో హిట్ సినిమాలు తీశా. మహేశ్‌బాబుని ‘రాజకుమారుడు’ చిత్రంతో పరిచయం చేశా. ఈ రోజు ఈ సినిమా అనుకోకుండా మే 1న ప్రీ రిలీజ్ ఫంక్షన్, మే 9న రిలీజ్ అవుతోంది. గతంలో నా రెండు సినిమాలు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’కి కూడా అలాగే జరిగింది. యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ ‘దిల్’రాజు, పీవీపీగార్లతో కలిసి ‘మహర్షి’ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారి 25వ సినిమాని మూడు పెద్ద బ్యానర్స్ కలిసి చేశాం. ఈ నెల 9న మీకు అద్భుతమైన సినిమాని ఇస్తున్నామని నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ‘ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టారు’ అని నాకు ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి. ‘ఊపిరి’ తర్వాత వంశీ ఈ ఐడియాని మహేశ్‌గారికి చెప్పారు. ఇది చేయాలా? వద్దా? అనే చిన్న డైలమాలో ఉన్నారు మహేశ్. కానీ అదే ఎనర్జీతో పూర్తి కథ రాసి మహేశ్‌గారిని ఒప్పించారు. ఈ కథ నేను చేస్తున్నాను అని మహేశ్‌గారు చెప్పినప్పుడు వంశీ కళ్లలో నీళ్లు తిరిగాయి. మొన్నే సినిమా చూపించాడు. క్లైమాక్స్ చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. లాస్ట్ డే షూటింగ్‌లో.. అందరి హీరోలతో నేను క్లోజ్‌గా ఉంటా... కానీ, మహేశ్‌గారు షేక్‌హ్యాండ్ మాత్రమే ఇచ్చారు. ఎవరికైనా అంతే. లాస్ట్ డే అందరికీ హగ్ ఇచ్చాను.మహేశ్‌కి ఇవ్వాలా? వద్దా? అని అలా మలుపు తిరుగుతుంటే.. మహేశ్‌గారు చేతులు చాపి నాకు హగ్ ఇవ్వరా? అన్నారు. అది గ్రేట్ మూమెంట్’’ అన్నారు.
ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ ప్రయాణం మూడేళ్లకిందట మొదలైంది. అప్పుడే ‘మహర్షి’ ఐడియా చెప్పాడు వంశీ. ‘ఊపిరి’ రిలీజ్ రోజు రాత్రి మేమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పుడే మహేశ్‌గారు కాల్ చేసి మంచి సినిమా తీశారంటూ నన్ను, వంశీని అభినందించారు. ‘ఊపిరి’ విడుదలైన 9వ రోజు వంశీ వెళ్లి మహేశ్‌గారికి లైన్ చెప్పాడు.. పూర్తి స్క్రిప్ట్ తీసుకుని రమ్మన్నారాయన. ఈ రోజు తక్కువ మాట్లాడతాను. మే 18న విజయవాడలో సక్సెస్‌మీట్ పెట్టాం, అక్కడ ఎక్కువ మాట్లాడతాను’’ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో పేపర్స్ విసిరేసిన రోజులున్నాయి. ఫ్యాన్స్ టికెట్టు కొన్నప్పుడు ఏం కోరుకుంటారో మా అందరికీ తెలుసు. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ గార్లకి కృతజ్ఞతలు. ఈ నెల 9 సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే రోజు అవుతుంది. మహేశ్‌గారు యాక్టర్‌గానే సూపర్‌స్టార్‌కాదు. ఒక వ్యక్తిగా సూపర్‌స్టార్’’ అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబు అభిమానిగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇంటర్‌మీడియట్ నుంచి మావోడు అనుకుంటుండే. నేను సినిమాలు చూడటం ‘మురారి’తో స్టార్ట్ చేశా. బాల్కనీలో చూశా. టికెట్ల కోసం పడే కష్టాలు.. అమ్మాయిల క్యూ తక్కువ ఉంటుంది.. వారి ద్వారా టికెట్లు తెప్పించుకునేవాణ్ణి. ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ చూసి విజయ్ అద్భుతంగా చేశాడు అని మహేశ్‌బాబుగారు చేసిన ట్వీట్ చదవగానే ఫిదా అయిపోయా. మీరు ట్వీట్ చేసే మంచి సినిమాలు చేయాలని ఆశ. ఈ నెల 9న నా బర్త్‌డే రోజు ‘మహర్షి’ రిలీజ్ అవుతుండటంతో ఒత్తిడిలా అనిపిస్తోంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ వేడుకలో పూజా హెగ్డే, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హీరోలు ‘అల్లరి’ నరేశ్, సుధీర్‌బాబు, నిర్మాత అనీల్ సుంకర, నటులు పోసాని కృష్ణమురళి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కెమెరామేన్ కె.యు.మోహనన్, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment