‘లడ్డుబాబు’లో లావుగా కనిపిస్తా
నిడదవోలు, న్యూస్‌లైన్: కామెడీ పాత్రల నుంచి విభిన్నపాత్రల్లో నటించాలనే కోరికతో అల్లరి రవిబాబు దర్శకత్వంలో లడ్డుబాబు సినిమా చేసినట్టు హీరో అల్లరి నరేష్ చెప్పారు. మంగళవారం నిడదవోలులో షూటింగ్‌లో పాల్గొన్న ఆయన కొంతసేపు విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ‘లడ్డుబాబు సినిమాలో నేను పూర్తిగా లావుగా కనిపిస్తా. ఒక మనిషి 250 కేజీల్లో ఎలా ఉంటాడో అదే గెటప్‌లో కనిసిస్తా. ఆ సినిమా వచ్చేనెలలో విడుదలవుతంది. ఇప్పటివరకు నేను 45 చిత్రాల్లో నటించాను. సొంత సంస్థ ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఆరు చిత్రాల్లో నటించాను. నా 50వ చిత్రం మా బ్యానర్‌పై నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో చిన్నికృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాను. మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలను సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే స్వామిరారా, ఉయ్యాల జంపాలా వంటి సినిమాలు హిట్ అయ్యాయి.
దర్శకునిగా చూడాలనుకున్నారు.
నాన్నగారు అన్నయ్య ఆర్యన్ రాజేష్‌ను హీరోగా, నన్ను దర్శకునిగా చూడాలనుకున్నారు. ప్రస్తుతం అన్నయ్య ప్రొడక్షన్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. నాన్నగారికోరిక మేరకు నాలుగేళ్లలో దర్శకత్వం చేపట్టి బయట హీరోలతో చిత్రం నిర్మిస్తా. మాది నిడదవోలు మండలం కోరుమామిడి అని అందరూ అనుకుంటారు. మాది కొవ్వూరు మండలం దొమ్మేరు. నేను పుట్టింది పాలకొల్లులో. సామాజిక సేవ చేయాలనే తలంపుతో తండ్రి సత్యనారాయణ పేరున ట్రస్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న’ట్టు నరేష్ వెల్లడించారు.