ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ పనుల్లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే డీజే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో తరువాత చేయబోయే సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. అంతకన్నా ముందే జూన్ 21 నుంచే కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.
స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నట్టుగా బన్నీ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలం వెయిట్ చేసిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవటంతో బన్నీతో ఈ సినిమా చేస్తున్నాడు.