హీరో.. విలన్!
‘‘నేను హ్యాండ్‌సమ్‌గా ఉన్నాను... నా బాడీ కత్తిలా ఉంది’’ అని చెప్పుకునేవాళ్లు ఎక్కువమందే ఉంటారు. కానీ, ‘నాకున్న లుక్స్‌కీ, నా బాడీ లాంగ్వేజ్‌కీ ఇంత దూరం రావడమే చాలా ఎక్కువ’ అని తమను తాము తక్కువ చేసుకుని చెప్పేవాళ్లు మాత్రం తక్కువమంది ఉంటారు. అల్లు అర్జున్ రెండో కోవకు చెందుతారు. ఆ మధ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తాను సుమారుగా ఉంటాననీ, బాడీ లాంగ్వేజ్ అంతంత మాత్రం అని బన్నీ అన్నారు. ఏదో అలా అన్నారు కానీ, ఏ పాత్ర చేస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చేసుకోవడం బన్నీ స్టైల్. ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘సరైనోడు’ వరకూ తీసుకుంటే..
సినిమా సినిమాకీ నటుడిగా ఎదిగిన వైనం, హ్యాండ్‌సమ్‌గా తయారైన వైనం కూడా స్పష్టంగా తెలుస్తుంది. నటుడిగా కూడా భేష్ అనిపించుకున్నారు. హీరోగా పాజిటివ్ షేడ్‌ని మాత్రమే కాదు.. ‘ఆర్య-2’లో నెగటివ్ షేడ్స్‌నీ అద్భుతంగా ఆవిష్కరించారు. విలనీ టచ్ ఉన్న పాత్రలకు కూడా బన్నీ బాగా పనికొస్తారని చెప్పడానికి ‘ఆర్య-2’ ఒక్కటి చాలు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గా తనను చూసే అవకాశం ఉందన్నది ఫిలింనగర్ టాక్. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రం చేయనున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒకటి హీరో.. మరోటి విలన్ పాత్ర అని భోగట్టా. ఇప్పటివరకూ మనం చూసిన బన్నీ వేరు.. ఈ సినిమాలో కనిపించబోయే బన్నీ వేరు అని వినికిడి. మరి.. నిజంగానే లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందా? ఒకవేళ ఉన్నా హీరో, విలన్.. ఇలా రెండు పాత్రలు చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే జస్ట్ కొన్ని రోజులు ఆగాల్సిందే.