ఇంతలో ఎంత మార్పు... జీవితమంటే అదేనేమో!‘మనిషికి తోడుగా తానుండలేడు కాబట్టే... తనకు బదులుగా అమ్మను సృష్టించాడు దేవుడు’ అంటుంటారు భావుకులు. ఇది అందమైన, భావోద్వేగ పూరితమైన కల్పిత భావన అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే... ఇందులో నిజం లేకపోలేదు. ఎలాగంటారా! ఇక్కడ దేవుడంటే ఎవరో కాదు.. నాన్నే. కుటుంబ పోషణ తలకెత్తుకున్న నాన్నకు ఎల్లకాలం బిడ్డలతోనే ఉండటం కుదరదు. అందుకే... తనకు ప్రతిరూపమైన అమ్మను బిడ్డలకు తోడు చేస్తాడు.
తానెక్కడున్నా.. ఎలా ఉన్నా.. కుటుంబం గురించే ఆలోచిస్తాడు, వారి అభ్యున్నతినే ఆకాంక్షిస్తాడు. ఆ విధంగా ఆ భావుకులు చెప్పిన ఆ దేవుడు నాన్నే అన్నమాట. ఈ రోజు ఫాదర్స్‌డే కాదే... మరి ఈ నాన్న స్మరణేంటి? అనుకుంటున్నారా! ఇక్కడున్న తండ్రీకొడుకుల్ని చూస్తే.. ఎవరికైనా నాన్నను కాసేపు స్మరించుకోవాలనిపిస్తుంది. బిడ్డలపై తండ్రికి ఉండే ఆపేక్షకు నిలువెత్తు సాక్ష్యం ఈ స్టిల్స్. మొన్నటిదాకా తాను ఓ తండ్రి కొడుకు... ఇప్పుడు తానే ఓ బిడ్డ తండ్రి.
ఇంతలో ఎంత మార్పు.తన రీసెంట్ హిట్ ‘రేసుగుర్రం’ బాక్సాఫీస్ వద్ద టాప్ 4 స్థానంలో నిలిచినవేళ అభిమానులకు ఏదైనా ప్రత్యేక కానుక ఇవ్వాలనుకున్నారాయన. అందుకే తన ముద్దుల తనయుడు అల్లు అయాన్‌ని చూడాలని గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం... శనివారం అయాన్ స్టిల్స్ మీడియాకు విడుదల చేసి, వారి కోరిక తీర్చేశారు. ఇదిగో వీడే.. అల్లు వారి బుల్లాడు. బాగున్నాడు కదూ!