‘ఇండస్ట్రీ హిట్ అని నిర్మాతలు చెప్పారు. ఇది నా విక్టరీ కాదు’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని చెప్పిన మొదటి వ్యక్తి చిరంజీవిగారు. ప్రతి హీరోకి ఏదో టైమ్‌లో ఒక రికార్డు సినిమా పడుతూ ఉంటుంది. మా నాన్న అరవింద్‌గారికి గీతా ఆర్ట్స్‌లో 10 ఆల్ టైమ్ సినిమాలు రికార్డ్ హిట్లు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త కాదు. నాన్నగారితో ఒక కొడుకుగా ఫస్ట్ టైమ్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం ఆనందంగా ఉంది.
మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశారు. ఈ స్థాయికి తగ్గట్టు నేను ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను బెస్ట్ చేయాలని చేశాను. దాన్ని జనం ఆదరించారు. ఇది గోల్డ్‌మైన్ అవుతుందని నేనూహించలేదు. సినిమా అనేది టీమ్ వర్క్. ఒకరి పేరే చెప్పాల్సి వస్తే అది డైరెక్టర్ త్రివిక్రమ్‌గారే. ఈ సినిమాపై నీ ఫీలింగ్ ఏంటి బన్నీ? అని మా నాన్న అడిగారు. ‘ఇదంతా త్రివిక్రమ్ మాయ డాడీ’ అన్నాను’’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘అంకెలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు, బన్నీకి అంకెల బదులు ఈ సినిమా ఎంతమంది చూశారనేదే ఎక్కువ ఆనందం ఇస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment