Thrivikram
-
ఇదంతా త్రివిక్రమ్ మాయ – అల్లు అర్జున్
‘ఇండస్ట్రీ హిట్ అని నిర్మాతలు చెప్పారు. ఇది నా విక్టరీ కాదు’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని చెప్పిన మొదటి వ్యక్తి చిరంజీవిగారు. ప్రతి హీరోకి ఏదో టైమ్‌లో ఒక రికార్డు సినిమా పడుతూ ఉంటుంది. మా నాన్న అరవింద్‌గారికి గీతా ఆర్ట్స్‌లో 10 ఆల్ టైమ్ సినిమాలు రికార్డ్ హిట్లు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త కాదు. నాన్నగారితో ఒక కొడుకుగా ఫస్ట్ టైమ్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం ఆనందంగా ఉంది. మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశారు. ఈ స్థాయికి తగ్గట్టు నేను ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేను బెస్ట్ చేయాలని చేశాను. దాన్ని జనం ఆదరించారు. ఇది గోల్డ్‌మైన్ అవుతుందని నేనూహించలేదు. సినిమా అనేది టీమ్ వర్క్. ఒకరి పేరే చెప్పాల్సి వస్తే అది డైరెక్టర్ త్రివిక్రమ్‌గారే. ఈ సినిమాపై నీ ఫీలింగ్ ఏంటి బన్నీ? అని మా నాన్న అడిగారు. ‘ఇదంతా త్రివిక్రమ్ మాయ డాడీ’ అన్నాను’’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘అంకెలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు అవసరం. అక్షరం మాకు ఎంత అవసరమో అంకెలు వాళ్లకు అంత అవసరం. నాకు, బన్నీకి అంకెల బదులు ఈ సినిమా ఎంతమంది చూశారనేదే ఎక్కువ ఆనందం ఇస్తుంది’’ అన్నారు. -
కాజల్ స్పెషల్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్’ అంటూ ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ చేశారు కాజల్ అగర్వాల్. ఈ పాట సూపర్ హిట్. కాజల్ స్టెప్స్‌కి ఫ్యాన్స్ విజిల్స్ మీద విజిల్స్ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక పాటలోనూ కనిపించలేదు కాజల్. లేటెస్ట్గా మరో స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాట ఉందట. ఆ పాటకు కాజల్ స్టెప్పేస్తే అదిరిపోతుందని చిత్రబృందం భావించిందట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ కథానాయికలుగా కనిపిస్తారు. టబు, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
ఆన్ సైలెంట్ మోడ్
‘సైలెంట్ మోడ్’ అంటే ఫోన్ పరిభాషలో ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నామని, అందుకే సైలెంట్ మోడ్‌లో పెట్టాం అని అర్థం. ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకే వెళ్లారు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ యూనిట్. విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ‘ఆన్ సైలెంట్ మోడ్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందట హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన పనులన్నీ చాలా సైలెంట్‌గా చేస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్. స్క్రిప్ట్ వర్క్ విషయంలో కూడా చాలా సైలెంట్‌గానే ఉన్నారు త్రివిక్రమ్. ఇంత సైలెంట్‌గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారంటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయటానికే అనుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే, శ్రద్ధాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. హారికా హాసినీ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతాన్ని తమన్, కెమెరాను పీఎస్ వినోద్ హ్యాండిల్ చేయనున్నారని సమాచారం. -
మళ్లీ సిక్స్ ప్యాక్‌తో ఎన్టీఆర్
ఎన్టీఆర్ మొదటిసారి ఆన్ స్క్రీన్ చొక్కా విప్పింది ఎప్పుడు? ‘టెంపర్’లో. ఆరు పలకల దేహంతో ఆ సినిమాలో కనిపించి, ఆకట్టుకున్నారు. మళ్లీ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నారు. దీనికోసం కసరత్తులు చేస్తున్నారు. మరి.. ఈసారీ చొక్కా విప్పుతారా? అంటే సమాధానం తెలియడానికి చాన్నాళ్లు పడుతుంది. ఇంతకీ ఏ సినిమా కోసం సిక్స్ ప్యాక్ అంటే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న మూవీకే. ఇందులో ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. దాని కోసం ట్రైనర్ ‘స్టీవెన్ లాయిడ్స్’ పర్యవేక్షణలో ట్రైనింగ్ ప్రాసెస్‌లో ఉన్నారు. సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఎన్టీఆర్ సుమారు 18 కిలోలు బరువు తగ్గనున్నారు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా ఫినిష్ చే సి, ప్రస్తుతం ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట దర్శకుడు త్రివిక్రమ్. పూర్తి స్థాయి లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. -
ఇద్దరూ టీచర్లే
‘ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చు’... ఎన్టీఆర్‌కి సలహా ఇస్తున్నారు లాయిడ్ స్టీవెన్స్, ‘ఇలా చేస్తే ఈజీగా గాలిపటం ఎగరేయొచ్చు’... స్టీవెన్స్‌కి సలహా ఇచ్చారు ఎన్టీఆర్. బాగుంది.. తగ్గే విషయంలో ఎన్టీఆర్‌కి స్టీవెన్స్ గురువు అయితే.. గాలిపటాలు ఎగరేసే విషయంలో స్టీవెన్స్‌కి గురువు అయ్యారు ఎన్టీఆర్. ఇంతకీ ఏంటి కహానీ అంటే... ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారు. అందుకే హాలీవుడ్ నుంచి లాయిడ్ స్టీవెన్స్ ఇండియా వచ్చారు. దగ్గరుండి ఎన్టీఆర్‌కి ఫిజికల్ ట్రైనింగ్ చేయిస్తున్నారు. సంక్రాంతి పండగకి మాత్రం ఎన్టీఆర్ దగ్గరుండి స్టీవెన్స్ చేత గాలిపటాలు ఎగరేయించారు. ‘‘గాలి పటాలు ఎలా ఎగరేయాలో ఎన్టీఆర్ నేర్పించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని విదేశీ ట్రైనర్ లాయిడ్ పేర్కొన్నారు. -
బర్త్‌డే మంత్‌లో స్టార్ట్!
ఇక్కడ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్... ముగ్గురి ఫొటోలున్నాయి. ఎవరి బర్త్‌డే మంత్‌లో ఏం స్టార్ట్ కాబోతోంది అనుకుంటున్నారా? పుట్టినరోజు నెల రాజమౌళిది. స్టార్ట్ కాబోతున్నది సినిమా. ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబినేషన్లో రాజమౌళి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. రాజమౌళి పుట్టింది ఆ నెలలోనే. పదో నెల పదో తేదీన పుట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టనున్నారు. అక్టోబర్‌కల్లా ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఇక రామ్‌చరణ్ ఆల్రెడీ ‘రంగస్థలం’తో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పూర్తవుతుంది. ఇదే నెలలోనే బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేయనున్న సినిమా మొదలవుతుంది. ఇది కూడా అక్టోబర్‌కల్లా పూర్తయిపోతుంది. సో.. రాజమౌళి సినిమా చేయడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్ పదో నెలకి ఫ్రీ అయిపోతారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. -
సినిమా తీయడం పెద్ద అవస్థ – త్రివిక్రమ్
‘‘నాకు సినిమా తప్ప వేరే విషయాలు గురించి పెద్దగా తెలియదు. పెద్దది కావొచ్చు.. చిన్నది కావొచ్చు! రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్ వరకూ ఎవరైనా సినిమా తీస్తూనే ఉండాల్సిందే’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు. నాకిష్టమైన వాళ్లలో తనూ ఒకడు. వెంకీ డైరక్టర్ కావడం హ్యాపీ. సాయి కొర్రపాటి బ్యానర్‌తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకూ వచ్చింది. కొత్త బ్యానర్లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ‘స్వయంవరం’ సినిమాకు చాలా కష్టాలు పడ్డాను. సినిమా తీయడం పెద్ద అవస్థ. ఆ అవస్థను ‘ఛలో’ యూనిట్ అధిగమించిందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ యూనివర్సిటీలా భావిస్తే, అందులో త్రివిక్రమ్‌గారిని హయ్యస్ట్ కేడర్ ప్రొఫెసర్‌గా భావిస్తా. అటువంటి దర్శకుడి వద్ద పనిచేయడం గర్వంగా ఉంది. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో జరిగే కాలేజీ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘నాకిష్టమైన త్రివిక్రమ్ గారి చేతుల మీదగా టీజర్ విడుదల కావడం హ్యాపీ. ఆయన బ్యానర్లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో.. నా బ్యానర్‌లోనూ అలాంటి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తా’’ అన్నారు నాగశౌర్య. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు రష్మికా మండన్నా. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్. -
కొత్త ప్రేమకథ
హీరో నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకీ కుడుముల డైరెక్షన్లో ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి ఓ చిత్రం నిర్మించనున్నారు. కన్నడ భామ రష్మిక మండన్న కథానాయిక. సాగర్ మహతి సంగీత దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత శంకర ప్రసాద్ తెలియజేస్తూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో సినిమా నిర్మించాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాం. త్రివిక్రమ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ చేసిన వెంకీ కుడుముల చెప్పిన కథ నచ్చింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త ప్రేమకథా చిత్రం ఇది. మా సంస్థలో తొలి సినిమా కాబట్టి రాజీపడకుండా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్ 10న చిత్రాన్ని ఆరంభించాలను కుంటున్నాం’’ అని అన్నారు. ‘‘సినిమాలో నాగశౌర్య క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ చిత్రంలో హస్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్ర దర్శకుడు వెంకి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సాయి శ్రీరామ్. -
మెగా మూవీ షురూ!
అన్న చిరంజీవి–తమ్ముడు పవన్ కల్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక, ఒకే సినిమాలో కనిపిస్తే వాళ్లు పరమానందపడిపోతారు. చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘నా పేరే కాంచనమాల..’ పాటలో పవన్ కల్యాణ్ కాసేపు కనిపిస్తేనే, హ్యాపీ ఫీలయ్యారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ టైమ్ వచ్చే సింది. చిరు–పవన్ కాంబినేషన్లో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని గురువారం టీయస్సార్ అధికారికంగా ప్రకటించారు. మరిన్ని విశేషాలను టీయస్సార్ చెబుతూ– ‘‘చిరంజీవిగారి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ చూశాక మళ్లీ సినిమాలు నిర్మించాలనిపించింది. ఇటీవల ఈ చిత్రబృందాన్ని సన్మానించి నప్పుడు చిరంజీవి–పవన్ కాంబినేషన్లో సినిమా తీస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇద్దర్నీ ప్రత్యేకంగా కలసి డిస్కస్ చేశాను. నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ బెస్ట్ అనుకున్నాను. అతనితో కూడా మాట్లాడాను. ఈ చిత్రాన్ని గ్రేట్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్‌తో కలసి నిర్మించబోతున్నా’’ అని చెప్పారు. గతంలో శోభన్ బాబుతో ‘జీవన పోరాటం’, చిరంజీవితో ‘స్టేట్ రౌడీ, రాజశేఖర్‌తో ‘గ్యాంగ్‌మాస్టర్’తో పాటు సంస్కృత సినిమా ‘భగవద్గీత’, పలు హిందీ చిత్రాలు నిర్మించారు టీయస్సార్. చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా ఈ మెగా మూవీ చేయనున్నారు. -
ఖుష్బూ పవర్ఫుల్ రీ–ఎంట్రీ !
-
పవర్ఫుల్ రీ–ఎంట్రీ!
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ చిత్రంలో చిరూకి అక్కగా నటించారు ఖుష్బూ. ఆ చిత్రం విడుదలై పదేళ్లవుతోంది. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ‘స్టాలిన్’ తర్వాత ‘యమదొంగ’లో అతిథి పాత్రలో కనిపించిన ఖుష్బూ తొమ్మిదేళ్ల తర్వాత నటించనున్న తెలుగు చిత్రం ఇది. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్రకి ఖుష్బూని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘అభిమానులకు శుభవార్త. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేయబోతున్నా. పవన్– త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నేనూ భాగం అయినందుకు సంతోషిస్తున్నా. త్రివిక్రమ్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఇందులో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగులో నా చివరి సినిమా చిరంజీవితో చేశా. ఇప్పుడు ఆయన తమ్ముడితో చేస్తుండటం సంతోషంగా ఉంది. ‘స్టాలిన్’ తర్వాత ‘యమదొంగ’లో నటించినా అతిథి పాత్ర కావడం.. మూడు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొనడంతో పూర్తి స్థాయి చిత్రంగా లెక్కలోకి తీసుకోను. ఇప్పుడు అంగీకరించిన ఈ సినిమాలో నాది పెద్ద పాత్ర’’ అని చెప్పారు. -
నా కెరీర్‌కు హార్ట్ లాంటి సినిమా!
‘‘నా కెరీర్‌ను 2002లో మొదలుపెట్టాను. ఈ 14 సంవత్సరాల్లో 22 సినిమాలు చేశాను. 2011 వరకూ ఫ్లాప్స్ వచ్చాయి. నా పనైపోయిందన్నారు. కానీ, ఏనాడూ కుంగిపోలేదు. నా పంథా మార్చుకున్నాను. ‘ఇష్క్’ నుంచి ప్రేమకథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. ఈ నాలుగేళ్లలో చాలా నేర్చుకున్నాను. ఈ టైమ్‌లో నాకు దక్కిన మంచి అవకాశం ‘అ...ఆ’ ’’ అని హీరో నితిన్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు... ♦ ‘హార్ట్ ఎటాక్’ షూటింగ్ అప్పుడు, త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి, మనం కలిసి సినిమా చేద్దామనగానే చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే వీవీ వినాయక్‌గారు, రాజమౌళిగార్లతో పనిచే యడం నా లక్. త్రివిక్రమ్‌గారితో ఎప్పట్నుంచో వర్క్ చేయాలను కుంటున్నా. ఆయనే స్వయంగా సినిమా చేద్దామనగానే వెంటనే ఓకే అన్నాను. ‘అత్తారింటికి దారేది’ రిలీజయ్యాక మా సినిమాని సెట్స్‌కి తీసుకెళదామనుకున్నాం. కానీ, అది జరగలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వేరే సినిమా చేశాను. గతేడాది ఒప్పుకున్న ఒక సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఆరు నెలలు ఖాళీగా ఉండాలా? అని అనుకుంటున్నప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌గారి ఫోన్‌కాల్‌తో ‘అ.. ఆ’కు పునాదులు పడ్డాయి. ♦ నేనిప్పటివరకూ చేసిన ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. అలాగని ఇదేదో కొత్త కథ అని చెప్పను. ఒక్క ప్రేమకథే అని కాకుండా, కుటుంబ అనుబంధాలతో త్రివిక్రమ్‌గారి శైలిలో సాగే అందమైన కథ. ఈ సినిమాలో త్రివిక్రమ్‌గారు నా పాత్రకు కాస్త బరువు, బాధ్యతలు అప్పగించారు. ఇందులో నేనో చెఫ్. సంతోషం, బాధ, రొమాన్స్.. ఇలా అన్ని భావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుంటూ చేసిన సినిమా. ఇది నా కెరీర్‌కు హార్ట్ లాంటి మూవీ. ♦ రాజమౌళిగారి తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ గారు. నా పాజిటివ్స్, నెగటివ్స్ ఇలా అన్నిటినీ డిస్కస్ చేసి, నన్ను మరింత కొత్తగా చూపించారు. వ్యక్తిగతంగా నాతో ఆయన అనుబంధం బలపడింది. త్రివిక్రమ్‌గారికి తెలీని విషయం లేదు. ఆయనో జ్ఞాని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక నుంచి నేను ఫస్ట్ ఫోన్ చేసేది ఆయనకే. ♦ నా ఫేవరేట్ హీరో పవన్‌కల్యాణ్ ఈ సినిమా సెట్స్‌కు రావడం స్వీట్ షాక్. సడన్‌గా ఆయన సెట్లో ప్రత్యక్షమయ్యేసరికి టెన్షన్ పడ్డాను. ఆయన ముందు నటించాను కూడా. బాగా చేశాననే అనుకుంటున్నా. ♦ ‘అఖిల్’ రిజల్ట్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎన్నో అంచనాలతో, ఆశలతో తీసిన సినిమాకి నెగటివ్ టాక్ వచ్చేసరికి చాలా ఫీలయ్యా. నాలుగైదు రోజుల పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. హిట్, ఫ్లాప్ అనేవి సర్వసాధారణం. కానీ, నా ఫ్రెండ్ అఖిల్ లాంచింగ్ సినిమా అలా కావడం నన్ను బాధించింది. ♦ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సీక్వెల్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ పూర్తయింది. సెకండాఫ్ బాగా వస్తేనే చేస్తాను. ఎందుకంటే ప్రీక్వెల్‌ను చెడగొట్టకూడదు కదా! ఫ్రెండ్ మాత్రమే! సమంత ఓ హీరోతో లవ్‌లో ఉన్నారని ప్రచారమవుతోంది కదా... ఆమె మీ ఫ్రెండ్ కాబట్టి.. ఆ హీరో ఎవరో మీకు తెలుసా? అనే ప్రశ్న నితిన్ ముందుంచితే - ‘‘సమంత నాకు ఫ్రెండే. కానీ, తన పర్సనల్ విషయాలు చెప్పుకునేంత కాదు’’ అన్నారు. -
పరిచయం కావడానికి పాతికేళ్లు!
‘అ’ అంటే ఏంటి? ‘అనసూయా రామలింగం’. మరి.. ‘ఆ’ అంటే ఆనంద్ విహారి. ఈ రెండక్షరాలూ పక్క పక్కనే ఉంటాయి. కానీ, అనసూయ, ఆనంద్ విహారి ఎక్కడెక్కడో ఉంటారు. ఓ సందర్భంలో ఒకే ట్రైన్ ఎక్కుతారు. మాటలు కలపకుండానే - ఒకరి పేర్లు ఒకరికి తెలిసిపోతాయ్. అప్పుడు సమంత తనలో తాను ‘పక్క పక్కనే ఉండే అక్షరాలు. పరిచయం కావడానికి పాతికేళ్లు పట్టింది’ అనుకుంటుంది. బుధవారం విడుదలైన ‘అ.. ఆ’ టీజర్లో సమంత అనే ఈ మాటలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. రొమాంటిక్ ఫీల్‌తో కనిపించే ఈ టీజర్ చాలు.. దర్శకుడు త్రివిక్రమ్ అందమైన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఇవ్వనున్నారని చెప్పడానికి! అనసూయా రామలింగం పాత్రలో సమంత, ఆనంద్ విహారిగా నితిన్ నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ మరో కథానాయిక. ఒక కీలకమైన పాత్రలో నదియా నటిస్తున్నారు. మమత సమర్పణలో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టీజర్‌కు మంచి స్పందన లభించినందుకు ఆనందంగా ఉంది. ఇది చక్కని ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీ. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన పాటలను ఈ నెలలో, మే ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్. -
గుండె గుప్పెండంత ఊహ ఉప్పెనంత...
సినిమా వెనుక స్టోరీ - 38 ఆ హాల్లో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు విజయభాస్కర్ మొదలుకొని ఆఫీసుబాయ్ దాకా పది, పదిహేను మంది ఉన్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో సహా కథ చెబుతున్నాడు. కొందరు ముసి ముసిగా నవ్వుతుంటే, ఇంకొందరు పగలబడి నవ్వుతున్నారు. ఈ రియాక్షన్స్ అన్నీ రవికిశోర్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ‘శుభం’ అంటూ త్రివిక్రమ్ స్క్రిప్టు మూసేశాడు. అక్కడున్నవాళ్లంతా త్రివి క్రమ్కి కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్ భాస్కర్ - త్రివిక్రమ్ ఇద్దర్నీ రవికిశోర్ హగ్ చేసుకున్నారు. ఆ హగ్‌లోనే తెలిసి పోయింది... కథ ఎంత బాగా నచ్చేసిందో! ‘నువ్వేకావాలి’ ఉషాకిరణ్ మూవీస్ బ్యానలో రూపొందినా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మేకింగ్ అంతా చూసు కున్నది రవికిశోరే. ‘నువ్వే కావాలి’ ఎండింగ్లో ఉండగానే విజయ్‌భాస్కర్, త్రివిక్రమ్లిద్దరికీ అడ్వాన్స్ ఇచ్చేసి ‘‘నెక్స్ట్ సినిమా కూడా మనం కలిసి చేస్తున్నాం’’ అనేశారాయన. వాళ్లిద్దరూ ఆయనకు అంత బాగా కనెక్టయిపోయారు. వాళ్లతో పని చేస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్ అతి కొద్దిమంది దగ్గరే కలుగు తుంది. ‘నువ్వే కావాలి’ రిజల్ట్ ఎలా ఉన్నా సరే, వాళ్లిద్దరితో కలిసి పనిచేయాలని రవి కిశోర్ డిసైడయ్యారు. అలాగని ‘నువ్వే కావాలి’ మీద డౌట్లు లేవాయనకు! ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ నమ్మకమే నిజమైంది. ‘నువ్వే కావాలి’ ఇండస్ట్రీని ఊపేసింది. ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే ముగ్గురూ నెక్స్ట్ సినిమా పనిలో పడ్డారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో శ్రీనివాస్ అపార్ట్మెంట్. థర్డ్ ఫ్లోర్లో శ్రీ స్రవంతీ మూవీస్ ఆఫీస్. అక్కడ రెండు నెలలు కూర్చుని త్రివిక్రమ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు రెడీ చేసేశాడు. దాన్ని మెయిన్ టీమ్ అందరికీ వినిపిస్తే హండ్రెడ్ మార్క్స్ వేసేశారు. ఎప్పుడో దర్శకుడు కేవీరెడ్డి గారి టైమ్‌లో ఇలా టీమ్ అందరికీ స్క్రిప్టు వినిపించేవారట. రవికిశోర్‌కు కూడా ఆ పద్ధతి ఇష్టం. ఆయన ఎంత హ్యాపీ అంటే బ్రీఫ్ కేస్‌లో చెక్కు బుక్కులన్నీ తీసేసి, ఈ స్క్రిప్టే పెట్టుకుని తిరుగుతున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా తనివి తీరా చదువు కుంటున్నారు. కథ మొత్తం కంఠస్థం వచ్చేసింది. ఏ హీరోతో అయినా చేయడానికి రెడీ. కానీ ఈ కథ ఎవరికో రాసిపెట్టే ఉండుంటుంది. అవును... రాసి పెట్టి ఉంది... వెంకటేశ్‌కి! రవికిశోర్‌కి నిర్మాత డి.సురేశ్‌బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచి ప్రపోజల్. ‘‘విజయ్‌భాస్కర్ - త్రివి క్రమ్లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?’’ అంత పెద్ద హీరో పిలిచి డేట్లు ఇస్తానంటే, ఎవరు మాత్రం కాదంటారు? రవికిశోర్‌కు బ్రహ్మాండంగా ఓకే త్రివిక్రమ్ కథ చెప్పాడు. వెంకటేశ్ ఫ్లాట్! ‘‘వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్’’ అనుకున్నాడు. కానీ వెంకటేశ్కో డౌట్! సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే నడిచి పోతోంది. ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ కావాలి కదా! అవును నిజమే! గుడ్ సజెషన్. ఎంతైనా సీనియర్ సీనియరే! ‘మిస్టర్ బీన్’ ఇన్స్పిరేషన్తో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి, అతణ్ణి హీరో హీరోయిన్లకు తారసపడేలా చేస్తే...? త్రివిక్రమ్ అదే చేశాడు. బ్రహ్మానందం లాంటోడు ఈ క్యారెక్టర్ చేస్తేనా...? లాంటోడేంటి? బ్రహ్మానందమే చేస్తాడు. చేయాలి కూడా! ఓకే అన్నాడు కూడా! క్యారెక్టర్స్ అన్నిటికీ స్టార్స్ ఫిక్స్డ్. కేవలం టూ క్యారెక్టర్స్ బ్యాలెన్స్. ఒకటి - హీరోయిన్ పాత్ర. రెండోది - హీరోయిన్ ఫాదర్ పాత్ర. ప్రొడ్యూసర్, డెరైక్టర్లిద్దరికీ ఒకటే చాయిస్... ప్రకాశ్‌రాజ్! అతనైతే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ ప్రకాశ్‌రాజ్ ఆ టైమ్‌లో ఫుల్ బిజీ. దానికి తోడు ఫుల్ ట్రబుల్స్‌లో కూడా ఉన్నాడు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వాళ్లు అతని మీద బ్యాన్ పెట్టారు. ప్రకాశ్‌రాజ్‌ను తెలుగు సినిమాల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. రవికిశోర్‌కి కోపం వచ్చింది. ‘‘నా క్యారెక్టర్‌కి అతనే కావాలి. నేను అతణ్ణే పెట్టుకుంటాను.’’ పరిస్థితి కొంచెం హాట్ హాట్‌గానే ఉంది. నాజర్, రఘువరన్ లాంటి వాళ్లతో ఈ పాత్ర చేయించేయొచ్చు. కానీ, ప్రకాశ్‌రాజ్ అయితేనే ఆ డెప్త్ వస్తుంది. అందుకే ఓ పని చేస్తే? ప్రకాశ్‌రాజ్ సీన్స్ అన్నీ పెండింగ్‌లో పెట్టి, మిగతా వెర్షన్ కంప్లీట్ చేసేస్తే? బాగానే ఉంది కానీ, హీరోయిన్ తేలడం లేదు. త్రిష... ఇంకెవరో... ఎవరో... చాలా ఆప్షన్స్. కానీ ఫ్రెష్ ఫేస్ అయితే నే బాగుంటుంది. విజయభాస్కర్ ముంబై వెళ్లాడు. మోడల్ కో-ఆర్డినేటర్స్ దగ్గర చాలామంది అమ్మాయిల స్టిల్స్ చూశాడు. వాళ్లల్లో ఒకమ్మాయి నచ్చేసింది. ‘పాగల్పన్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. పేరు - ఆర్తీ అగర్వాల్. కానీ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది. నో కాంటాక్ట్. మామూలుగా అయితే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేవారు. కానీ, ఆ పాత్ర ఆమెకే రాసిపెట్టినట్టుంది. అందుకే న్యూయార్క్‌లో ఆమె గురించి వేట మొదలైంది. సురేశ్‌బాబు ఫ్రెండొకరు న్యూయార్క్‌లోనే ఉంటారు. ఆయన ద్వారా ట్రై చేస్తే దొరికేసింది. ఆర్తి వచ్చీ రావడంతోనే షూటింగ్ స్టార్ట్. సినిమా మొత్తం దాదాపు హీరోయిన్ ఇంట్లోనే! అందుకే నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు. 60 లక్షల ఖర్చు. సీన్లు.. సాంగ్స్.. షూటింగ్ చకచకా సాగిపోతోంది. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. న్యూజిలాండ్‌లో రెండు పాటలు తీయాలి. అదీ నెక్స్ట్ షెడ్యూల్లో! ఈలోగా అక్కడ నుంచి ఫోన్! ‘‘సీజన్లో చేంజ్ ఉంది. మీరొచ్చే టైమ్‌కి గ్రీనరీ ఉండదు. వస్తే ఇప్పుడే రావాలి’’. ఇక్కడేమో 10 - 15 మంది ఆర్టిస్టులతో షూటింగ్ జరుగుతోంది. ఇది అర్ధంతరంగా వదిలేసి, న్యూజిలాండ్ వెళ్తే మళ్లీ డేట్లు దొరకడం కష్టం. రవికిశోర్ ఒకటే అన్నారు. ‘‘మనుషుల డేట్లు ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రకృతి డేట్లు మన చేతిలో ఉండవు.’’ షెడ్యూల్ ఆపేసి మరీ న్యూజిలాండ్ వెళ్లారు! ఫ్లయిట్లో ఆ రెండు పాటలూ వింటూనే ఉంది ఆర్తి. తెలుగు అస్సలు రాకపోయినా వినీ వినీ బట్టీ వచ్చేశాయామెకు! న్యూజిలాండ్‌లో దిగగానే ఆ పాటలు పాడేయడం కూడా మొదలుపెట్టింది. తీరా అక్కడికి వెళ్లాక వెంకటేశ్‌కి ఫుల్ ఫీవర్. ఆ ఫీవర్‌తోనే షూటింగ్ చేసేశాడు. న్యూజిలాండ్ నుంచి సరాసరి చెన్నైలో ల్యాండింగ్. అక్కడ ‘ఎం.జి.ఎం. అమ్యూజ్మెంట్ పార్క్’లో షూటింగ్. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్, బ్రహ్మానందం, ‘కళ్లు’ చిదంబరం, బేబీ పింకీలపై కామెడీ సీన్స్. అక్కడి నుంచి మళ్లీ ఊటీ. త్రివిక్రమ్ స్క్రిప్ట్ మహాత్మ్యమో, రవికిశోర్ ప్లానింగ్ చిత్రమో, విజయ భాస్కర్ దర్శక చాతుర్యమో కానీ షూటింగ్ చాలా స్మూత్‌గా జరిగిపోతోంది. ‘పిక్నిక్’ అనేమాట అందరూ వాడేస్తుం టారు. కానీ, ఇక్కడ మాత్రం అది నిజం. 64 రోజులు 64 క్షణాల్లా గడిచిపోయాయి. ప్రకాశ్‌రాజ్ రిలేటెడ్ సీన్స్ ఒక్కటే బ్యాలెన్స్. వీళ్లకు అదృష్టం కలిసొచ్చింది. ఇక్కడ పరిణామా లన్నీ మారిపోయాయి. మునుపటి హీట్ లేదు. ప్రకాశ్‌రాజ్ నిరాహారదీక్షకు దిగడంతో అన్ని సమస్యలూ కొలిక్కి వచ్చేశాయి. ఆయనపై బ్యాన్ కూడా తీసే శారు. ఆ న్యూస్ వచ్చిన మరుక్షణం ప్రకాశ్ రాజ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సెట్లో ఉన్నాడు. కంటిన్యుయస్‌గా 17 రోజులు వర్క్ చేశాడు. హమ్మయ్యా... సినిమాకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు! ఇప్పుడు అసలు పనంతా మ్యూజిక్ డెరైక్టర్ కోటి చేతిలో ఉంది. బ్రహ్మాండంగా రీ-రికార్డింగ్ చేయాలి. ఇదే టార్గెట్. నో టైమ్ లిమిట్. ట్వంటీ సిక్స్ డేస్ తర్వాత... రవి కిశోర్, విజయ్‌భాస్కర్ ఫైనల్ అవుట్‌పుట్ చూశారు. కొన్ని ఎపిసోడ్స్‌లో రీ-రికార్డింగ్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. రవికిశోర్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. కోటికి అర్థమైపోయింది. మళ్లీ రికార్డింగ్ థియే టర్లో కూర్చున్నాడు. స్మాల్ చేంజెస్. 99కి 100కి ఒక్కటే కదా తేడా! అదిప్పుడు ఫుల్ ఫిల్ అయిపోయింది. రవికిశోర్ ఈసారి చూసి కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆ హగ్‌లోనే రిజల్ట్ తెలిసిపోయింది. 2001 సెప్టెంబర్ 6... 3 గంటల 12 నిమిషాలు ఓపిక పడితే తప్ప రిజల్ట్ తెలియదు. అవును... ఈ సినిమా నిడివి అంతే! బయటికొచ్చిన వాళ్లంతా ‘‘సినిమా బాగుంది కానీ, లెంగ్త్ ఎక్కువైపోయింది’’ అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడిపోతున్నారు. రవికిశోర్ మాత్రం చాలా తాపీగా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి భరోసా. ఆ టైమ్‌లో వెంకటేశ్కిది డిఫరెంట్ అటెంప్ట్. దానికి తోడు సినిమాలో నో ఫైట్స్. ఫ్యాన్స్‌లో కొంత డైలమా ఉంటుంది. నాలుగు రోజులు ఆగితే అంతా సెట్ అయిపో తుంది. అవతలేమో పెద్దపెద్దవాళ్లు కూడా ఫోన్లు చేసి, అరగంట సినిమా ఎడిట్ చేసేయమంటున్నారు. ముఖ్యంగా సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమంటున్నారు. రవికిశోర్ మాత్ర ం మొండిగా ఉన్నారు. ఒక్క షాట్ కూడా తీసేది లేదు. ఈ సినిమా సూపర్‌హిట్... అంతే. ఎస్... వన్ వీక్ తర్వాత రిజల్ట్ అదే! అందరూ ఈ సినిమాను ‘నువ్వు నాకు నచ్చావ్’ అనడం మొదలుపెట్టారు. ‘స్రవంతి’ రవికిశోర్ టేబుల్ మీద ‘నువ్వు నాకు నచ్చావ్’ స్క్రిప్టు ఎప్పుడూ ఉంటుంది. అదో ఇన్స్పిరేషన్ ఆయనకు! జాబ్ శాటిస్ఫేక్షన్ ... జేబు శాటిస్ఫేక్షన్ కలగాలంటే స్క్రిప్టే పరమావధి అనే విషయం ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది! వెరీ ఇంట్రస్టింగ్ ⇒వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే, ఈ సినిమాకైన బడ్జెట్ నాలుగున్నర కోట్ల రూపాయలు. ⇒ఈ సినిమాకు ఆర్తీ అగర్వాల్ పారితోషికం పది లక్షలు. ⇒తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్‌తో రీమేక్ చేశారు. యావరేజ్. కన్నడంలో మాత్రం హిట్. ⇒‘ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...’ పాట కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది. - పులగం చిన్నారాయణ -
హాట్ సమ్మర్లో... కూల్ ఫిల్మ్
శివరాత్రితో ‘శివ...శివ...’ అంటూ చలి ఎగిరిపోయి, ఎండలు పెరుగుతున్న టైమ్‌లో తెలుగు చిత్రసీమ కూడా క్రమంగా వేడెక్కుతోంది. ఎగ్జామ్స్ సీజన్ అవగానే కొత్త సినిమాలతో బాక్సాఫీస్‌పై దాడి చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు. నితిన్, సమంత, మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ అనుపమా పరమేశ్వరన్‌లు హీరో హీరోయిన్లుగా, దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘అ...ఆ...’ (అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) కూడా ఈ వేసవిలోనే మే 6న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) బృందం గురువారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వారం టీజర్... మే 6న సినిమా కుటుంబమంతా కలసి చూసి ఆనందించదగ్గ, రొమాంటిక్-కామెడీ కోవకు చెందిన లవ్‌స్టోరీ ఇది. ‘‘ఇటీవలే కేరళలోని పొల్లాచ్చి పరిసరాల్లో కీలకమైన టాకీ, పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. శుక్రవారం నుంచి ప్యాచ్‌వర్క్ షూటింగ్, ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు రెండు పాటల చిత్రీకరణ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అలాగే, ఈ వారంలోనే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను ఏప్రిల్ రెండోవారంలో జనం ముందుకు తీసుకురానున్నారు. ఆ వెంటనే మే 6న సినిమా రిలీజ్. నిజాయతీ నిండిన ప్రయత్నం నదియా, సీనియర్ నరేశ్, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎన్. నటరాజ సుబ్రమణియన్ కెమేరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. వ్యక్తుల మధ్య అనుబంధాలనూ, కుటుంబ సంబంధాలనూ త్రివిక్రమ్ మార్కు శైలి ఆహ్లాదకరమైన సన్నివేశాలు, సంభాషణలు, ఆలోచింపజేసే అంశాలతో నిజాయతీగా, వాస్తవిక ధోరణిలో ఈ సినిమాలో చూపెట్టనున్నట్లు భోగట్టా. వెరసి, గత వేసవికి అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ప్రేక్షకులకు విందు చేసిన త్రివిక్రమ్ ఈసారి హీరో నితిన్‌తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘అ...ఆ...’ను జనం ముందుకు తెస్తున్నారు. ‘‘ఈ హాట్ సమ్మర్లో ఇది కూల్ సినిమా’’ అని చిత్ర యూనిట్ వర్గాలు అభివర్ణించాయి. ఎండలు మండే ‘మే’ వేళ ఎవరైనా కోరుకొనేది అదేగా! -
పొల్లాచ్చిలో... 10 డేస్
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా తయారవుతున్న తాజా చిత్రం ‘అ...ఆ...’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) షూటింగ్ తుది దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ త్వరితంగా పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ తలమునకలై ఉన్నారు. మమత సమర్పణలో పి.డి.వి. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ బుధవారం నాడు పొల్లాచ్చి పరిసరాల్లో ముగిసింది. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, అనన్య, హరితేజ, హాస్యనటుడు ప్రవీణ్ తదితర తారాగణం పాల్గొనగా, ఫిబ్రవరి 15 నుంచి పదిరోజుల పాటు పొల్లాచ్చి పరిసరాల్లో తమిళనాడు, కేరళ గ్రామాల్లో షూటింగ్ జరిపారు. ‘‘250 నుంచి 300 మందితో కూడిన భారీ యూనిట్ వెళ్ళాం. పొల్లాచ్చిలో బస చేస్తూ, రోజుకో చోట చొప్పున రకరకాల ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. కొంత టాకీ పార్ట్, రెండు పాటలు, ఒక చిన్న ఫైట్ చిత్రీకరించాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి. దీనితో మరో రెండు పాటలు, కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా సినిమాలో ప్రధాన భాగమంతా అయిపోయింది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్యాచ్‌వర్క్ చేస్తున్నారు. పొల్లాచ్చి పరిసరాల్లోని పచ్చని పంటచేలు లాంటివన్నీ సినిమాలోని దృశ్యాలకు మరింత అందం తెస్తాయని సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘‘మరో 2 పాటలను హైదరాబాద్‌లో చిత్రీకరించి, మార్చిలో ఆడియో రిలీజ్ చేస్తాం. పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తిచేసుకొని, ముగించుకొని, ఏప్రిల్ 22న కానీ, మే 6న కానీ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’’ అని నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ త్రివిక్రమ్ మార్క్ అందమైన ప్రేమకథలో ఆనంద్ విహారి పాత్ర తనకెంతో పేరు తెస్తుందని నితిన్ భావిస్తున్నారు. సమంత కూడా ‘ఏం మాయ చేసావే’, ‘ఈగ’, ‘మనం’ తరహాలో ‘అ..ఆ..’ తనకు ఓ చిరస్మరణీయ సినిమా అవుతుందంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకొన్న ఈ లవ్ ఎంటర్టైనర్ కోసం కొన్నాళ్ళు ఆగాలి. -
అక్షరాలా ‘అఆ’
దర్శక, రచయిత త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకులకు అ, ఆలను సరికొత్త రీతిలో పరిచయం చేస్తున్నారు. మామూలుగా ‘అ’ అంటే అమ్మ... ‘ఆ’ అంటే ఆవు అని చదువుకున్నాం. కానీ, త్రివిక్రమ్ ఇప్పుడు ఈ అక్షరాలకు కొత్త అర్థం చెబుతున్నారు. ‘అ’ అంటే అనసూయ రామలింగం అనీ, ‘ఆ’ అంటే ఆనంద్ విహారిఅని అంటున్నారు. ఆనంద్ విహారి ఎవరంటే హీరో నితిన్. మరి... అనసూయ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, ఈ చిత్రంలో సమంత, అనుపమా పరమేశ్వరన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. కొత్త సంవతర్సం సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ‘అ... ఆ’ లోగోను విడుదల చేశారు. బాపుగారి శైలిలో కనిపి స్తున్న ఆ లోగో సింప్లీ సుపర్బ్ అనేలా ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కొత్త బృందాన్ని ఎంచుకున్నారు. సంగీత దర్శకు డిగా ‘కొలవెరి’ పాట ఫేమ్ అనిరుధ్, ‘లవ్ ఆజ్ కల్’ ఫేమ్ ఛాయాగ్రాహ కుడు నటరాజ సుబ్రమ ణియన్ తదితరులు తొలిసారి త్రివిక్రమ్‌తో జట్టుకట్టారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ కోసం వెయిట్ అండ్ వాచ్. -
‘‘నేనే వస్తాను’’
పంచ్ శాస్త్ర దర్శకులే రచయితలయ్యాక పంచ్‌లు పవర్ఫుల్ అయ్యాయి. త్రివిక్రమ్దైతే వెరీమచ్ కార్డియల్ పంచ్. తొడ కొట్టించడు. మీసం మెలి తిప్పించడు. వెనుక గుండ్లు, సౌండ్లు పెట్టడు. వింజామరలా పంచ్‌లు విసురుతాడు. ఉద్వేగపు అగ్నిపర్వతానికి సెలైన్సర్ అమర్చి పేల్చినట్లు కూల్‌గా స్పిల్ అవుతుందా పంచ్! ‘అతడు’ సినిమానే తీస్కోండి. మహేశ్‌బాబు ‘యుద్ధానికి’ బయల్దేరి వెళ్లబోయే ముందు త్రిష పరుగున వచ్చి ‘‘నేనూ వస్తాను’’ అని అతడిని అల్లేసుకుంటుంది. మహేశ్‌బాబు మృదువుగా త్రిషను విడిపించుకుని ‘‘నేనే వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోతాడు. ప్రేక్షకుల హృదయాన్ని కదిలించిన పంచ్ ఇది. అసలు పంచ్‌కి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సన్నివేశం నుంచే! ఎంత మామూలు డైలాగునైనా సన్నివేశం పంచ్ డైలాగ్‌గా మార్చేయగలదు. అందుకు చక్కటి ఉదాహరణే ‘‘నేనే వస్తాను’’ అనే డైలాగ్. అలా సన్నివేశం, పంచ్ డైలాగ్ ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకుంటాయి. ‘అతడు’ సినిమాలో ‘నేనే వస్తాను’’ అనే డైలాగ్ పంచ్ డైలాగ్‌గా ఎస్టాబ్లిష్ అవడానికి సన్నివేశం ఎలా తోడ్పడిందో మీరే చూడండి. సీన్: సీబీఐ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మహేశ్‌బాబును వెతుక్కుంటూ నాజర్ ఇంట్లోకి చొరబడి గాలిస్తుంటారు. ‘‘ఆ... బై ది బై మూర్తిగారూ మీ ఇంట్లో ఉన్నాడే ఆ కుర్రాడు. వాడు మీ మనవడు కాదు. వాడి పేరు నందు. హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి హత్య కేసులో వాడికోసం వెతుకుతున్నాం’’ అని చెప్తాడు. నాజర్ బ్లాంక్‌గా ఉండిపోతాడు. సీబీఐ వాళ్లు వెళ్లిపోయాక మహేశ్‌బాబు ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో అందరూ అతడిని దోషిలా చూస్తుంటారు. నానా మాటలు అంటారు. మహేశ్‌బాబు నేరుగా నాజర్ దగ్గరికి వెళతాడు. ఆయన ఎదురుగా మోకాళ్లపై కూర్చొని మెల్లిగా చెప్పడం మొదలుపెడతాడు. ‘‘నిజం చెప్పే ధైర్యం లేనోడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిణ్ణి చూశాక (పార్థు తల్లిని చూపిస్తూ) పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేక పోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు’’ అంటాడు మహేశ్‌బాబు. (‘‘రెంటికీ పెద్ద తేడా ఏంటో’’ అంటాడు అక్కడే ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం వ్యంగ్యంగా...) ‘‘నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రాటానికి కారణం ఒకటే... ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరున్నారు. ఒకళ్లు మీరు. ఇంకొళ్లు... (పాజ్)... అని ఆగినప్పుడు త్రిష వైపు కెమెరా తిరుగుతుంది. ‘‘వచ్చాను. చెప్పాను. ఇంక మీ ఇష్టం’’ అంటాడు (నాజర్ వైపు చేతులు చాస్తూ) మహేశ్‌బాబు. కనెక్టింగ్ సీన్: నాజర్ మహేశ్‌బాబుని చెయ్యి పట్టుకుని పై గదిలోకి తీసుకెళతాడు. ‘‘నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం చెప్తావా?’’ అంటాడు. ‘‘ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా, వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ల పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావ్? వాళ్ల పిల్ల పెళ్లంటే నువ్వెందుకు డబ్బులిచ్చావ్? వాళ్లు తిడితే ఎందుకు పడ్డావ్? ఏమీ చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలొంచుకుని మోకాళ్ల మీద ఎందుకు కూర్చున్నావ్? ఆ.. అందుకే నువ్వే పార్థు. నువ్వే నా పార్థువి’’ అంటాడు. ‘‘నేను నిన్నేమీ అడగను. అడిగితే, నాయుడు లాంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచె తీయించేసిన రోజే నిన్ను అడిగుండాల్సింది. పాతికేళ్ల వయసులో పది లక్షలు చెక్కిచ్చావంటే, ‘ఏం చేస్తున్నావు నువ్వు’ అని ఆరోజే నేను అడిగుండాల్సింది. అప్పుడడగలేదు. ఇప్పుడు అడిగే అర్హత లేదు’’ అంటాడు. గోడపై తుపాకీని అందుకుని - ‘‘ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది. ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేశావని వాడెవడో అన్నాడు. ఇప్పుడు యుద్ధం చెయ్యమని నేను చెప్తున్నాను’’ అంటాడు.. తుపాకీని మహేశ్‌బాబు చేతికి అందిస్తూ. ‘‘వెళ్లు. గెలిస్తే రా. గెలవక పోతే నువ్వేమైపోయావో అనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాక్కావలసింది అబద్ధాలు, నిజాలు కావు. జ్ఞాపకాలు’’ అంటాడు. మహేశ్‌బాబు వంగి నాజర్ కాళ్లకు దండం పెడతాడు. ‘‘జాగ్రత్త’’ అని ఆశీర్వదిస్తాడు నాజర్. ఇదంతా వింటున్న త్రిష, మహేశ్‌బాబు గదిలోంచి బయటికి రాగానే ఉద్వేగంతో ఒక్కసారిగా పరుగున వెళ్లి మహేశ్ బాబుని చుట్టేసుకుంటుంది. గట్టిగా పట్టుకుని వదలిపెట్టేది లేదన్నట్లు ఏడుస్తుంది. ‘‘నేనూ వస్తాను’’ అంటుంది.మహేష్‌బాబు త్రిషను మెల్లగా విడిపించుకుని తల అడ్డంగా ఊపుతూ ‘‘నేనే వస్తాను’’ అంటాడు. అని వెళ్లిపోతాడు. సన్నివేశం మలిచిన పంచ్ ఇది. పదాలను మార్చకుండా భావాలను మలిచారు త్రివిక్రమ్. అందుకే అంత పెద్ద హిట్ అయింది. - మాధవ్ శింగరాజు -
ఇది అంచనాలు అందుకొనే సినిమా : దర్శకుడు శంకర్
భారతీయ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలోని విజువల్ అద్భుతం ‘ఐ’ తెలుగు పాటల విడుదల కార్యక్రమం సినీ పరిశ్రమలోని ఇతర దర్శక దిగ్గజాలకు కూడా వేదిక అయింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను తదితర తెలుగు దర్శక ప్రముఖులు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ అయింది. పాటల సీడీని రాజమౌళి ఆవిష్కరించగా, తొలి ప్రతిని త్రివిక్రమ్ అందుకున్నారు. ఈ వేడుకలో శంకర్ మాట్లాడుతూ, అందరం ఏళ్ళ తరబడి చేసిన శ్రమ ఫలితంగా రూపొందిన ‘ఐ’లోని దృశ్యాలు అంచనాలను పెంచేశాయన్నారు. అయినప్పటికీ, వాటన్నిటినీ ఈ సినిమా అందుకుంటుందని నమ్మకంగా చెప్పారు. ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలతో రాజమౌళికి అభిమానిగా మారిన తాను ‘బాహుబలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. అలాగే, ఇన్నేళ్ళుగా అనువాద చిత్రాలతోనే తెలుగు వారిని ఆకట్టుకుంటున్న తాను త్వరలోనే నేరుగా తెలుగులోనే సినిమా చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. ఆస్కార్ వి. రవిచంద్రన్ నిర్మించిన ‘ఐ’ చిత్రాన్ని మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ అధినేతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్లు తెలుగులో అందిస్తున్నారు. పాటల రచయిత చంద్రబోస్ ప్రసంగిస్తూ, శంకర్, విక్రమ్‌ల గురించి తనదైన శైలిలో తెలుగులో లోతైన విశ్లేషణ చేశారు. ఆ ప్రసంగం తాలూకు వివరాలను శంకర్, విక్రమ్‌లు త్రివిక్రమ్ ద్వారా అనువదింపజేసుకొని చెప్పించుకోవడం కనిపించింది. చిత్ర కథానాయకుడు విక్రమ్ మాట్లాడుతూ, మేకప్ వేసుకోవడానికి అయిదు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టిన పాత్ర కోసం, ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. కళాదర్శకుడు ముత్తురాజ్, ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ తదితర చిత్ర యూనిట్ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.