నా కెరీర్‌కు హార్ట్ లాంటి సినిమా!
‘‘నా కెరీర్‌ను 2002లో మొదలుపెట్టాను. ఈ 14 సంవత్సరాల్లో 22 సినిమాలు చేశాను. 2011 వరకూ ఫ్లాప్స్ వచ్చాయి. నా పనైపోయిందన్నారు. కానీ, ఏనాడూ కుంగిపోలేదు. నా పంథా మార్చుకున్నాను. ‘ఇష్క్’ నుంచి ప్రేమకథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. ఈ నాలుగేళ్లలో చాలా నేర్చుకున్నాను. ఈ టైమ్‌లో నాకు దక్కిన మంచి అవకాశం ‘అ...ఆ’ ’’ అని హీరో నితిన్ అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు...
♦ ‘హార్ట్ ఎటాక్’ షూటింగ్ అప్పుడు, త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి, మనం కలిసి సినిమా చేద్దామనగానే చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే వీవీ వినాయక్‌గారు, రాజమౌళిగార్లతో పనిచే యడం నా లక్. త్రివిక్రమ్‌గారితో ఎప్పట్నుంచో వర్క్ చేయాలను కుంటున్నా. ఆయనే స్వయంగా సినిమా చేద్దామనగానే వెంటనే ఓకే అన్నాను. ‘అత్తారింటికి దారేది’ రిలీజయ్యాక మా సినిమాని సెట్స్‌కి తీసుకెళదామనుకున్నాం. కానీ, అది జరగలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత వేరే సినిమా చేశాను. గతేడాది ఒప్పుకున్న ఒక సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఆరు నెలలు ఖాళీగా ఉండాలా? అని అనుకుంటున్నప్పుడు మళ్లీ త్రివిక్రమ్‌గారి ఫోన్‌కాల్‌తో ‘అ.. ఆ’కు పునాదులు పడ్డాయి.
♦ నేనిప్పటివరకూ చేసిన ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. అలాగని ఇదేదో కొత్త కథ అని చెప్పను. ఒక్క ప్రేమకథే అని కాకుండా, కుటుంబ అనుబంధాలతో త్రివిక్రమ్‌గారి శైలిలో సాగే అందమైన కథ. ఈ సినిమాలో త్రివిక్రమ్‌గారు నా పాత్రకు కాస్త బరువు, బాధ్యతలు అప్పగించారు. ఇందులో నేనో చెఫ్. సంతోషం, బాధ, రొమాన్స్.. ఇలా అన్ని భావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుంటూ చేసిన సినిమా. ఇది నా కెరీర్‌కు హార్ట్ లాంటి మూవీ.
♦ రాజమౌళిగారి తర్వాత నన్ను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ గారు. నా పాజిటివ్స్, నెగటివ్స్ ఇలా అన్నిటినీ డిస్కస్ చేసి, నన్ను మరింత కొత్తగా చూపించారు. వ్యక్తిగతంగా నాతో ఆయన అనుబంధం బలపడింది. త్రివిక్రమ్‌గారికి తెలీని విషయం లేదు. ఆయనో జ్ఞాని. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక నుంచి నేను ఫస్ట్ ఫోన్ చేసేది ఆయనకే.
♦ నా ఫేవరేట్ హీరో పవన్‌కల్యాణ్ ఈ సినిమా సెట్స్‌కు రావడం స్వీట్ షాక్. సడన్‌గా ఆయన సెట్‌లో ప్రత్యక్షమయ్యేసరికి టెన్షన్ పడ్డాను. ఆయన ముందు నటించాను కూడా. బాగా చేశాననే అనుకుంటున్నా.
♦ ‘అఖిల్’ రిజల్ట్‌ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎన్నో అంచనాలతో, ఆశలతో తీసిన సినిమాకి నెగటివ్ టాక్ వచ్చేసరికి చాలా ఫీలయ్యా. నాలుగైదు రోజుల పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. హిట్, ఫ్లాప్ అనేవి సర్వసాధారణం. కానీ, నా ఫ్రెండ్ అఖిల్ లాంచింగ్ సినిమా అలా కావడం నన్ను బాధించింది.
♦ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సీక్వెల్ ఫస్టాఫ్ స్క్రిప్ట్ పూర్తయింది. సెకండాఫ్ బాగా వస్తేనే చేస్తాను. ఎందుకంటే ప్రీక్వెల్‌ను చెడగొట్టకూడదు కదా!
ఫ్రెండ్ మాత్రమే!
సమంత ఓ హీరోతో లవ్‌లో ఉన్నారని ప్రచారమవుతోంది కదా... ఆమె మీ ఫ్రెండ్ కాబట్టి.. ఆ హీరో ఎవరో మీకు తెలుసా? అనే ప్రశ్న నితిన్ ముందుంచితే - ‘‘సమంత నాకు ఫ్రెండే. కానీ, తన పర్సనల్ విషయాలు చెప్పుకునేంత కాదు’’ అన్నారు.