
పొల్లాచ్చిలో... 10 డేస్
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా తయారవుతున్న తాజా చిత్రం ‘అ...ఆ...’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) షూటింగ్ తుది దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ త్వరితంగా పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ తలమునకలై ఉన్నారు. మమత సమర్పణలో పి.డి.వి. ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ బుధవారం నాడు పొల్లాచ్చి పరిసరాల్లో ముగిసింది. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, అనన్య, హరితేజ, హాస్యనటుడు ప్రవీణ్ తదితర తారాగణం పాల్గొనగా, ఫిబ్రవరి 15 నుంచి పదిరోజుల పాటు పొల్లాచ్చి పరిసరాల్లో తమిళనాడు, కేరళ గ్రామాల్లో షూటింగ్ జరిపారు. ‘‘250 నుంచి 300 మందితో కూడిన భారీ యూనిట్ వెళ్ళాం. పొల్లాచ్చిలో బస చేస్తూ, రోజుకో చోట చొప్పున రకరకాల ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం.
కొంత టాకీ పార్ట్, రెండు పాటలు, ఒక చిన్న ఫైట్ చిత్రీకరించాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి. దీనితో మరో రెండు పాటలు, కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా సినిమాలో ప్రధాన భాగమంతా అయిపోయింది. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్యాచ్‌వర్క్ చేస్తున్నారు. పొల్లాచ్చి పరిసరాల్లోని పచ్చని పంటచేలు లాంటివన్నీ సినిమాలోని దృశ్యాలకు మరింత అందం తెస్తాయని సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణియన్ పేర్కొన్నారు.
మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘‘మరో 2 పాటలను హైదరాబాద్‌లో చిత్రీకరించి, మార్చిలో ఆడియో రిలీజ్ చేస్తాం. పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తిచేసుకొని, ముగించుకొని, ఏప్రిల్ 22న కానీ, మే 6న కానీ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’’ అని నిర్మాత రాధాకృష్ణ పేర్కొన్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ త్రివిక్రమ్ మార్క్ అందమైన ప్రేమకథలో ఆనంద్ విహారి పాత్ర తనకెంతో పేరు తెస్తుందని నితిన్ భావిస్తున్నారు. సమంత కూడా ‘ఏం మాయ చేసావే’, ‘ఈగ’, ‘మనం’ తరహాలో ‘అ..ఆ..’ తనకు ఓ చిరస్మరణీయ సినిమా అవుతుందంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకొన్న ఈ లవ్ ఎంటర్‌టైనర్ కోసం కొన్నాళ్ళు ఆగాలి.