‘‘నాకు సినిమా తప్ప వేరే విషయాలు గురించి పెద్దగా తెలియదు. పెద్దది కావొచ్చు.. చిన్నది కావొచ్చు! రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్ వరకూ ఎవరైనా సినిమా తీస్తూనే ఉండాల్సిందే’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. నాగశౌర్య, రష్మికా మండన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఛలో’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిలో వెంకట్ ఒకడు.
నాకిష్టమైన వాళ్లలో తనూ ఒకడు. వెంకీ డైరక్టర్ కావడం హ్యాపీ. సాయి కొర్రపాటి బ్యానర్‌తో నాగశౌర్య మొదలు పెట్టిన ప్రయాణం తన సొంత బ్యానర్ వరకూ వచ్చింది. కొత్త బ్యానర్‌లో సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన ‘స్వయంవరం’ సినిమాకు చాలా కష్టాలు పడ్డాను. సినిమా తీయడం పెద్ద అవస్థ. ఆ అవస్థను ‘ఛలో’ యూనిట్ అధిగమించిందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ యూనివర్సిటీలా భావిస్తే, అందులో త్రివిక్రమ్‌గారిని హయ్యస్ట్ కేడర్ ప్రొఫెసర్‌గా భావిస్తా.
అటువంటి దర్శకుడి వద్ద పనిచేయడం గర్వంగా ఉంది. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో జరిగే కాలేజీ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘నాకిష్టమైన త్రివిక్రమ్ గారి చేతుల మీదగా టీజర్ విడుదల కావడం హ్యాపీ. ఆయన బ్యానర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో.. నా బ్యానర్‌లోనూ అలాంటి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తా’’ అన్నారు నాగశౌర్య. ‘‘తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు రష్మికా మండన్నా. ఈ సినిమాకి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment