ఈ జోడీ కుదిరింది!
పాత్ర డిమాండ్ మేరకు తనను తాను మలుచుకోవడం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్. ‘సరైనోడు’తో తనలోని స్టైల్‌తో పాటు ఊర మాస్‌ని చూపించారు. ఈ సినిమా విజయం తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’, సాయిధరమ్ తేజ్‌కి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి విజయాలు అందించారు హరీశ్.
‘ఆర్య’తో యూత్, ‘పరుగు’తో ఫ్యామిలీ ప్రేక్షకులకు అల్లు వారబ్బాయిని దగ్గర చేసిన ‘దిల్’ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు సమాచారం. నాగచైతన్య ‘ఒక లైలా కోసం’, వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాల్లో నటించిన పూజ ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు కమిట్ కాలేదు. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ సరసన ‘మొహంజొదారో’లో నటిస్తున్నారామె.
ఇక.. అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ‘‘ఏడేళ్ల తర్వాత అల్లు అర్జున్ మా సంస్థలో నటిస్తున్న చిత్రమిది. అతని ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే కథను హరీష్ సిద్ధం చేశారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.