‘‘నా సినిమా కథలు ముందుగా నాన్న వింటారు. సెట్స్‌కు వెళ్లే ముందు బన్నీ (అల్లు అర్జున్) కూడా వింటాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుంటాను. షూటింగ్ పూర్తి చేసి, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా వారికి సినిమా చూపిస్తా’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. నేడు (బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్కర్ సల్మాన్ చేసిన మలయాళ ‘ఏబీసీడీ’ రీమేక్ ఒకటి. సూర్యగారు హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌గారు కూడా ఉన్నారు. సూర్యగారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. జూలై 1న లండన్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
‘ఏబీసీడీ’ రీమేక్‌లో మిలియనీర్ కొడుకుగా కనబడతా. సంజీవ్ కొత్త డైరెక్టర్ అయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తనపై నాకు నమ్మకం ఏర్పడింది. రీమేక్ చేయడం చాలా కష్టం. రీమేక్‌ల గురించి మనం ఆలోచించినంతగా ప్రేక్షకులు ఆలోచించరు. వారికి సినిమా నచ్చితే చాలు. ఇలాంటి సినిమాలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ‘ఒక్క క్షణం’ సినిమా కమర్షియల్‌గా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. నా వరకు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అది. ఇతర హీరోల్లా వేగంగా సినిమాలు చేయడం లేదు. మా అన్నయ్య వచ్చి 15 ఏళ్లు అవుతున్నా 17 సినిమాలే చేశాడు. ఒక సినిమాపై ఫోకస్‌గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కరెక్టే. కానీ కమర్షియల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ చిత్రాలు చేయాలి. ఇకపై స్పీడ్ పెంచి, ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment