
నటిపై లైంగిక వేధింపులు.. అసోషియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ-AMMA) నిర్ణయంపై రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. అసోషియేషన్ నష్టనివారణ చర్యలపై హీరోయిన్లు మాత్రం శాంతించటం లేదు. ‘వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ తరపున 15 మంది సీనియర్ నటీమణులు తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అమ్మలో చేరబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘అమ్మపై నమ్మకం పోయింది. ఎట్టిపరిస్థితుల్లో అందులో చేరబోం. న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఇంక అసోషియేషన్‌ను నమ్మే ప్రసక్తే లేదు’ అంటూ.. వారంతా ప్రకటనలో పేర్కొన్నారు. నటి అక్కినేని అమలతోపాటు రంజనీ, సజిత మదంబిల్, కానీ కుస్రూతీ, శాంతి బాలచంద్రన్ తదితరులు అందులో ఉన్నారు. ‘ఇండస్ట్రీల్లో మహిళలను ఆటబొమ్మలుగా చూస్తున్నారని, అమ్మ వైఖరి అప్రజాస్వామ్యికంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలే అమలవుతున్నాయని, తమ తోటి నటి లైంగిక దాడికి గురైతే.. నిందితుడికి బాసటగా నిలిచే నిర్ణయం తీసుకుందని, సమాన వేతన చట్టం అమలు కావటంలేదని.. ఇలా 8 కారణాలతో కూడిన ఓ లేఖను డబ్ల్యూసీసీ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. మహిళల పట్ల వివక్షత పోయి.. సినిమా అంటే ప్రజలు ఓ మాధ్యమంగానే చూసే రోజులు రావాలని తాము కోరుకుంటున్నట్లు వారు లేఖలో తెలియజేశారు.
సంబంధిత కథనాలు...