ఇలాంటి సినిమా చేయడంనిజంగా కత్తిమీద సామే..!
‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నాటి సంఘటనలు అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఇలాంటి సినిమా చేయడం నిజంగా కత్తి మీద సామే. ఇది కల్పిత కథ కాదు కాబట్టి... జరిగింది జరిగినట్టుగా తీయాలి. ఏ మాత్రం చిన్న తేడా జరిగినా ఒప్పుకోరు. చరిత్ర ప్రకారం మల్‌బార్ భవన్‌లో గాంధీ-అంబేద్కర్‌ల మధ్య కొంత సంవాదం జరిగింది. అస్పృశ్యత గురించి ఎందుకు సందేశం ఇవ్వలేదని గాంధీని, అంబేడ్కర్ ప్రశ్నిస్తారు. ఈ ఎపిసోడ్‌ను జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. గాంధీని కించపరచకూడదు. అలాగని వాస్తవాన్ని కప్పిపుచ్చకూడదు.
గెటప్స్, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమాలో డైలాగులు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఒక డైలాగ్ అయితే నాకు ఇప్పటికీ గుర్తే. ‘లా’ చదవడం కోసం అంబేడ్కర్ లండన్ వెళ్తుంటాడు. భార్య ఆందోళన చెందుతూ ఉంటుంది. ‘‘నీకేం భయం లేదు... ఇంటి వ్యవహారాలన్నీ అన్నయ్య చూసుకుంటారు’’ అంటాడు అంబేడ్కర్. ‘‘చదువులో పడి భార్యాపిల్లలను మరిచిపోరు కదా’’ అని అంటుంది భార్య. దానికాయన ‘‘అలా మరిచిపోయి చదివితే నా ధ్యేయం నెరవేరినట్టేగా’’ అంటాడు. ఎంత గొప్ప డైలాగ్ అండీ! సంగీత దర్శకుడు చక్రవర్తి గారు తన ఆఖరి స్టేజ్‌లో ఈ సినిమా చేశారు.
రీ-రికార్డింగ్ వాళ్లబ్బాయ్ శ్రీ చేశాడు. ఇండియా-పాక్ విభజన టైంలో వచ్చే ఓ పాటను సి. నారాయణరెడ్డిగారు ఎక్స్‌ట్రార్డినరీగా రాస్తే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు అంతే ఎక్స్‌ట్రార్డినరీగా పాడారు. ఆకాశ్ ఖురానాకు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. రాష్ట్రపతిభవన్‌లో నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మగారు స్పెషల్ షో వేసుకుని చూశారు. మమ్మలందర్నీ సత్కరించారు కూడా. ఇండియన్ పనోరమాకు ఎంపిక చేశారు కానీ, అక్కడ ప్రదర్శించలేదు. దాంతో కొంత వివాదం జరిగింది. ‘గాంధీ’ చిత్రాన్ని కోట్లల్లో తీస్తే, మేం లక్షల్లో తీశాం. కానీ క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు.’’