జయబాధురిని పెళ్లాడక పోయుంటే..?
వానలో తడవనివారు... ప్రేమలో పడనివారు ఎవ్వరూ ఉండరంటారు. ప్రతి మనిషి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రేమలో పడి తీరతారంటారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. జయబాధురిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. అది ఓకే. కానీ, అంతకుముందు ఇంకెవరినైనా ప్రేమించారా? ఈ ప్రశ్న నేరుగా ఆయన్నే అడిగితే ఏం చెబుతారు! న్యూఢిల్లీలో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. వ్యాఖ్యాత సరదాగా ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే... ఒకవేళ మీరు జయబాధురిని పెళ్లాడకపోయుంటే ఎవరి ప్రేమను పొందడానికి ప్రయత్నించేవారు? అసలప్పుడు మీ మనసులో ఎవరున్నారు?.
అక్కడున్నవాళ్లంతా అమితాబ్ ఏం సమాధానం చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమితాబ్ ఒక్క క్షణం విరామమిచ్చి, అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఆయన చెప్పిన పేరు ఏంటో తెలుసా? వహీదా రెహమాన్. మన తెలుగమ్మాయే. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాక పాట..’లో తన నృత్యంతో అదరగొట్టి, ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ స్టార్‌గా ఎదిగారామె. అమితాబ్‌కన్నా ఆవిడ ఆరేళ్లు పెద్ద. అయినా కూడా ఆమె అంటే అమితాబ్‌కు పిచ్చి ప్రేమ. ఆమెను ఆకర్షించడానికి ఓ కవిత కూడా చెప్పాలనుకున్నారట. వహీదా అందం, నిరాడంబరతకు తాను ముగ్ధుణ్ణయ్యానని అమితాబ్ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభమని, చాలా ఆలస్యం అయిపోయిందని అమితాబ్ సరదాగా వ్యాఖ్యానించారు.