
స్త్రీలు రోజుకు అరవై రెండుసార్లు నవ్వుతారట. ఈ విషయంలో మగవాళ్లు మరీ పిసినారులు. వీళ్లు రోజుకు సగటున ఎనిమిది సార్లు మాత్రమే నవ్వుతారు. మరి పిల్లలు.. లెక్కలేనన్నిసార్లు కిలకిల నవ్వుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న బుడ్డోడు కూడా అలాంటి నవ్వుల రారాజే. వాడు పగలబడి నవ్వుతూనే మనల్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ప్రస్తుత పరిస్థితిలో మార్పు కోసం సరదాగా నవ్వేయండి' అంటూ క్యాప్షన్ జోడించాడు. వీడియో విషయానికొస్తే మిసిసిపికి చెందిన ఓ తల్లి తన కుమారుడికి తినిపిస్తోంది. (బాల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుందిగా..)
ఈ సమయంలో ఆమె ఒక్కసారిగా తుమ్మింది. వెంటనే బుడ్డోడు పగలబడి మరీ నవ్వాడు. తల్లి తుమ్మిన ప్రతీసారి పకపకా నవ్వుతూనే ఉన్నాడు. మరి ఆమె తుమ్మే సమయంలో మాస్కు పెట్టకుందా లేదా వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే ఆమె నిజంగా తుమ్మట్లేదు. కొడుకు నవ్వడం ఆపేసిన ప్రతీసారి వాడిని నవ్వించేందుకు మళ్లీ మళ్లీ తుమ్ము వచ్చినట్లు నటిస్తోంది. కాగా ఇది టిక్‌టాక్‌లో వైరల్ అయిన పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. లాక్‌డౌన్ టైంలో ఆ చిన్నోడి నవ్వులను ఆస్వాదిస్తూ మీరూ తనివితీరా నవ్వేయండి. (అరుదైన రెండు తలల తాబేలు ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment