నకిలీ వీడియోపై ఫైర్ : అమితాబ్ బచ్చన్
నకిలీ వీడియోపై ఫైర్ : అమితాబ్ బచ్చన్
Published Fri, Aug 23 2013 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
నటుడిగా ఫైర్ ఉన్న పాత్రలు బోల్డన్ని చేసి, ‘యాంగ్రీ మాన్’ ఇమేజ్ తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ఇప్పుడు నిజంగానే ఫైర్ అవుతున్నారు. ఈ ‘బిగ్ బి’ ఆగ్రహానికి కారణం అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్న ఓ నకిలీ వీడియో. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చూడాలని ఉందనే అభిప్రాయాన్ని అమితాబ్ వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారట.
ఆ ప్రచార సభలో మాట్లాడిన మాటలను, వేరే విధంగా మలిచి ఈ నకిలీ వీడియోను విడుదల చేసారట. ఇది చిన్న విషయం కాదని, ఈ తప్పు చేసిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా చూసుకుంటానని అమితాబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో అమితాబ్‌కి మోడీ కూడా సపోర్ట్ చేస్తూ, ‘ఇలా చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. కాగా, యూ ట్యూబ్‌లో వీరవిహారం చేస్తున్న ఈ నకిలీ వీడియోను సృష్టించింది ఉత్పల్ జీవ్జ్రనీ అనే వ్యక్తి అట. ఈ విషయం గురించి ఉత్పల్ ఓ ప్రకటనలో చెబుతూ -‘‘ఇలా జరిగినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నా.
నేను గుజరాతీ సినిమాలకు సంగీతదర్శకుడిగా చేస్తుంటాను. నేనా వీడియోను తయారు చేయలేదు. కనీసం ఎడిటింగ్ కూడా చేయలేదు. ‘వాట్సప్’ ద్వారా నా మొబైల్ ఫోన్‌కి ఈ వీడియో వచ్చింది. నేను మోడీ అభిమానిని. అమితాబ్ బచ్చన్ అంటే ఎనలేని గౌరవం. అందుకని ఆ వీడియోను అప్‌లోడ్ చేశాను. కానీ నకిలీ వీడియో అని ఆలస్యంగా తెలిసింది. వెంటనే తీసేస్తానని మాటిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
Advertisement