
అమితాబ్ ను వెంటాడుతున్న పాతకేసు
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మెడకు పాతకేసు చట్టుకుంది. అమితాబ్పై ఉన్న 2001 నాటి ఆదాయపన్ను కేసును మళ్లీ ప్రారంభించేందుకు ఆదాయపన్ను శాఖకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. బుధవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రఖ్యాత టీవీ షో 'కౌన్ బనేగా క్రోర్పతి'లో నటించడం ద్వారా అమితాబ్ ఆర్థిక కష్టాల నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రజల్లో విశేష ఆదరణ పొందిన ఈ షోలో నటించినందుకుగాను బిగ్ బీ అప్పట్లో భారీ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకున్నారు. అయితే ఈ షో ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి 2001-02 సంవత్సరంలో అమితాబ్ కోటి 66 లక్షల రూపాయలు పన్ను చెల్లించకుండా బకాయిపడినట్టు ఆదాయపన్ను శాఖ చెబుతోంది. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు 2012 జూలైలో అమితాబ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కాగా ఆదాయపన్ను శాఖ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ అమితాబ్కు చుక్కెదురైంది.