సైనికుల కోసం.. గళం విప్పుతున్న సూపర్ స్టార్
అమితాబ్ బచ్చన్ చెప్పారంటే.. దేశమంతా వింటుంది. ఆయన ఏమైనా చేస్తే.. అందరూ అదే చేస్తారు. పోలియోను దేశం నుంచి తరిమికొట్టాలన్నా.. స్వచ్ఛభారత్ అభియాన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్నింటికీ ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఆ పెద్దాయన మరోసారి తెరమీదకు వస్తున్నారు. ఈసారి భారత సైన్యం కోసం తన గళం విప్పుతున్నారు. ఉడీ ఉగ్రదాడిలో అసులువు బాసిన వీరసైనికులకు ఆ పాటను అంకితం ఇస్తున్నారు.
బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ ఇటీవల సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కోసం ఒక పాట పాడాలని కోరారు. అమితాబ్‌ది చాలా విలక్షణమైన గొంతు. పాత కాలంలోనే ఆయన పాడిన 'మేరే అంగనేమే తుమ్హారా క్యా కామ్ హై' లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తరుణ్ విజయ్ అడిగిన వెంటనే అమితాబ్ సరేనన్నారు. అమరుల కోసం పాట పాడటం అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని చెప్పారు.
ఇంతకుముందు టి-20 ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అమితాబ్ ముందుగా జాతీయగీతం పాడారు. కోట్లాది మంది ఆ మ్యాచ్‌తో పాటు అమితాబ్ పాటను కూడా లైవ్‌లో చూశారు. ఇప్పుడు ఆయన సైనికుల కోసం ప్రత్యేకంగా పాట పాడటం అంటే.. మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు.