మెగాస్టార్ సినిమాను చూడనున్న రాష్ట్రపతి
ముంబై: ఆధునిక మహిళపై సాగుతున్న అత్యాచారాలను, చూపుతున్న వివక్షతను ప్రశ్నిస్తూ రూపొందించిన సినిమా పింక్. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో , తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ కలెక‌్షన్లు సాధించటమే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడటమే కాక ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించారు.
తాజాగా ఈ సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నట్టు బిగ్ బీ తన బ్లాగ్‌లో వెల్లడించారు. శనివారం చిత్ర బృందంతో కలిసి ప్రణబ్ సినిమాను వీక్షించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు సినిమా చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని తాప్సి తెలిపారు. అమితాబ్ బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడే లాయర్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు.