ఎమీజాక్సన్‌తో విజయ్‌సేతుపతి డ్యూయెట్లు
ఎమీజాకసన్‌తో యువనటుడు విజయ్‌సేతుపతి డ్యూయెట్లు పాడనున్నారా? దీనికి అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కోలీవుడ్ నుంచి బదులు వస్తోంది. కథానాయకుడిగా తన స్థాయిని ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్న నటుడు విజయ్‌సేతుపతి. ఇంతకు ముందు వరకూ వర్థమాన కథానాయికలతో కలసి నటించిన ఈయన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నయనతారతో కలిసి రొమాన్స్ చేశారు. ఇదే ఇండస్ట్రీలోని చాలా మంది ఊహించని పరిణామం.
ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికి విఘ్నేష్ శివ దర్శకుడు. ఇదే టీమ్‌తో తాజాగా మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఆ పాత్రలను విఘ్నేష్ శివ ఫేవరేట్ నయనతార ఆమె స్నేహితురాలు త్రిషలతో నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే నయనతార పచ్చజెండా ఊపినా, త్రిష మాత్రం కనీసం కథ కూడా వినకుండా తానిప్పుడు చాలా బీజీగా ఉన్నానని రెడ్ సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చేసిందట. దీంతో దర్శకుడు విఘ్నేష్ శివ మరో హీరోయిన్ వేటలో పడక తప్పలేదు.
అలాంటి సమయంలో ఆయన దృష్టిలో పడ్డారు ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 2.ఓ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న నటి ఎమీజాక్సన్. ఆమె విజయ్‌సేతుపతితో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే ఎమీజాక్సన్ ఇంతకు ముందు సూర్యకు జంటగా మాస్ చిత్రంలో నయనతారతో కలసి నటించడానికి అంగీకరించి ఆ తరువాత తన పాత్రకు ప్రాధాన్యం తగ్గించారన్న ఆరోపణతో ఆ చిత్రం నుంచి వైదొలగారన్నది గమనార్హం.