
రెడ్ కార్పెట్‌పై ఎమీ జాక్సన్!
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయనున్నారు. కాగా ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి అయిన ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు.
ఇప్పటికే తెలుగులో రామ్‌చరణ్ ‘ఎవడు’తో సహా తమిళంలో ‘ఐ’, ఇటీవలి ‘తంగమగన్’ (తెలుగులో ‘నవ మన్మథుడు’), ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), రానున్న ‘2.0’ (రోబో-2) లాంటి చాలా సినిమాలతో ఎమీ మన దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితమే. పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఈ అందాల రాశి ప్రస్తుతం ఒక పక్క షూటింగ్, మరోపక్క ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో భోజన సమావేశానికి హాజరై, తన హిందీ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతున్న ఆమె సిరియా శరణార్థుల కోసం ఒక సహాయ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వీటన్నిటి మధ్యనే ‘కాన్స్’ ఉత్సవంలోనూ మెరిసేందుకు తీరిక చేసుకుంటున్నారు.
ఇంతకీ, అంతర్జాతీయ సినీ ప్రముఖులందరూ విచ్చేసే ‘కాన్స్’ వేడుక కోసం ఏ దుస్తులు వేసుకోవాలన్నది ఎమీ ఇంకా నిర్ణయించుకోలేదట! రిస్క్ తీసుకోవడానికి సిద్ధమనీ, ఈ వేడుక కోసం దాదాపు పాతిక నుంచి 30 దాకా దుస్తులు తయారు చేయించుకుంటున్నాననీ ఎమీ అంటున్నారు. అవును మరి... అందరి ముందూ అందంతో మెరిసిపోవాలంటే, ఆ మాత్రం హంగామా ఉండాల్సిందే కదూ!