ఆనంద్ దేవరకొండ
‘‘మా అన్న (విజయ్ దేవరకొండ) చాలా ఇబ్బందులు చూశాడు. కానీ, తనకు వచ్చిన సక్సెస్ నాకు ధైర్యాన్నిచ్చింది. ప్రతిభ ఉంటే విజయం సాధించొచ్చనే నమ్మకం కలిగింది’’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. డి.సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు.
► అన్న చేసిన ‘అర్జున్ రెడ్డి’ తర్వాత కొంతమంది మా నాన్నకి ఫోన్ చేసి, మీ పెదబాబు డేట్స్ దొరకడం లేదు.. చినబాబు దొరుకుతాడా? అని అడిగారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. వారి మాటలను అప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. అన్నయ్య వ్యాపారాలను సపోర్ట్ చేద్దామని ఉద్యోగం వదిలి ఇండియాకి వచ్చాను.
► నేను అమెరికాకు వెళ్లక ముందు థియేటర్స్ చేశాను. నటనలో అనుభవం ఉంది కానీ కెమెరా ముందు లేదు. ఆ టైమ్‌లో మహేంద్రను కలిశాక నటనపై ఉన్న భయాలు పోయాయి. ఆయన 5 గంటలు కథ చెప్పాడు. ‘దొరసాని’ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది.
► 1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ఇది. రాజు, దొరసాని మధ్య జరిగిన ప్రేమకథ. కథలోని స్వచ్ఛత, నిజాయతీ ఈ ప్రేమకథను ముందుకు నడిపిస్తాయి. అన్నీ రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం.
► విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ఉన్నాడని సినిమా సర్కిల్‌లో తెలుసు. ఈ కథ కోసం ఆర్టిస్ట్‌లను వెతుకుతున్నప్పుడు నన్ను ట్రై చేద్దామనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిషన్స్ చేశాం. ఆ పాత్రలకు సరిపోతాం అనే నమ్మకం దర్శక, నిర్మాతలకు వచ్చాకే మమ్మల్ని తీసుకున్నారు.
► ఇందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ధనవంతురాలైన దొరసానిని ప్రేమించిన పేదవాడైన రాజు చాలా సహజంగా అనిపిస్తాడు. ఈ సినిమాలో యాక్షన్, యాంగర్, లిప్‌లాక్‌లు లాంటివి ఏమీ ఉండవు.
► అన్నకు, నాకు సినిమాలంటే చాలా పిచ్చి. నాన్న టీవీ షోలు, సీరియల్స్ డైరెక్ట్ చేసేవారు. స్కూల్ డేస్ నుంచే అన్న స్టోరీలు రాసేవాడు. తను యాక్టర్ కాకపోతే డైరెక్టర్ అయ్యే వాడేమో బహుశా!
► ‘దొరసాని’ కథను ఓకే చేశాక నిర్మాతలు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి మా బాధ్యతను మరింత పెంచారు.
► నా తర్వాతి సినిమా కోసం రెండు కథలు విన్నాను. వాటిల్లో వినోద్ ఆనంద్ దర్శకత్వంలో ఒకటి. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం. నాకు ఏదైనా పాత్ర కరెక్టుగా సరిపోతుందని అన్నయ్యకి అనిపించి, నన్ను చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment