
మా ఆయనకో ఛాన్స్ ఇవ్వరూ!
సాధారణంగా ఎవరైనా తన కోసం అవకాశాలడుగుతారు. నటి అనన్య మాత్రం తన భర్త కో ఛాన్స్ ఇవ్వరూ అంటూ తనకు తెలిసిన దర్శక, నిర్మాతలను అడుగుతున్నారు. కుటుంబ కథా పాత్రలనే పోషిస్తానంటూ తన నిర్ణయానికి కట్టుబడిన అనన్య తమిళంలో నాడోడిగళ్, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఈ మలయాళ కుట్టి వ్యాపారవేత్త ఆంజనేయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కలకలం సృష్టించింది. అందుకు కారణం ఆంజనేయన్ ఇంతకుముందే పెళ్లైన వ్యక్తి కావడం. అనన్య ప్రేమ వివాహాన్ని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు.
అయినా ఈ ప్రేమ జంట ఆ మధ్య తిరుపతిలో రహస్య వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భర్తతో తిరువనంతపురంలో నివసిస్తున్న అనన్య సమస్యలు సద్దుమణగడంతో మళ్లీ నటనపై దృష్టి సారించారు. భరతన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రంలో అనన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెకు జంటగా గాయకుడు ప్రసన్న హీరోగా పరిచయం అవుతున్నారు. ఇది మలయాళంలో హిట్ అయిన కాక్‌టెయిల్ చిత్రానికి రీమేక్. వివాహానంతరం మళ్లీ నటించడానికి రెడీ అయిన అనన్య తనతో పాటు తన భర్తను నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తన భర్తకు అవకాశాలివ్వరూ అంటూ దర్శక నిర్మాతలను అడుగుతున్నారట.