
ప్రపంచ ఆరాధ్య మహిళ.. ఏంజెలీనా..!
హాలీవుడ్ నటి, ఫిల్మ్ మేకర్ ఏంజెలీనా జోలీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వయసు మీదపడుతున్నా ఏంజెలీనా పట్ల తగని ఆదరణ కనిపిస్తోంది. తాజాగా ఈమె ప్రపంచ ఆరాధ్య మహిళగా నిలిచింది. వెబ్ ఆధారితంగా జరిగిన ఒక పోల్ లో అనేక మంది మహిళామణుల మధ్య ఏంజెలీనాను ఆరాధ్యమైన మహిళగా నిలిపారు అభిమానులు.
యువ్గోవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 23 దేశాలకు చెందిన దాదాపు పాతికవేల మంది నెటిజన్లు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని పొందిన యూసూఫ్ మలాలాజాయ్, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ , కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వంటి ప్రముఖులందరికన్నా ఈ పోల్ లో ఏంజెలీనా కే ఎక్కువ ఆదరణ కనిపించింది.
మలాలా రెండో స్థానంలో నిలవగా... హిల్లరీ క్లింటన్, క్వీన్ ఎలిజబెత్ , మిషెల్ ఒబామాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అమెరికా టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రే, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్, రాజకీయ వేత్త అంగ్ సన్ సూకీ లు కూడా టాప్ 10 లో నిలిచారు. పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు.