డా.ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్ర దృశ్యం
తమిళనాడు,పెరంబూరు: అనిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంపై నిషేధం విధించాలంటూ ఆమె తండ్రి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది నీట్ పరిక్షల్లో ఉత్తీర్ణత కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని అనిత. అరియలూర్ జిల్లా కుళుమూర్ గ్రామానికి చెందిన షణ్ముగం కూతురు అనిత. ప్లస్ 2 పరీక్షల్లో 1200లకు గానూ 1176 మార్కులు తెచుకున్న ఈ విద్యార్థిని డాక్టరు కావాలని కలలు కనింది. అయితే నీట్ పరిక్షల్లో ఫెయిల్ కావడంతో తన కల కల్లలైపోయిందని భావించి మనస్తాపంతో గత ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కాగా అనిత జీవిత చరిత్ర సినిమాగా రూపొందుతోంది.
దీంతో ఆ చిత్రాన్ని నిషేధించాలంటూ అనిత తండ్రి షణ్ముగం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అందులో ఆయన పేర్కొంటూ తన కూతురు అనిత జీవిత చరిత్రను డా.ఎస్.అనిత ఎంబీబీఎస్ పేరుతో ఆర్‌జే పిక్చర్స్ పతాకంపై అజయ్‌కుమార్ అనే దర్శక నిర్మాత చిత్రంగా రూపొందిస్తున్నట్లు గత మే నెల 13వ తేదీన ప్రకటన చేశారన్నారు. అందులో బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ఫేమ్ జూలీ అనిత పాత్రలో నటిస్తున్నట్లు, చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారని అన్నారు. అయితే అజయ్‌కుమార్ అనే దర్శకుడు అనిత జీవిత చరిత్రను చిత్రంగా చేయడానికి తమ నుంచి అనుమతి పొందలేదన్నారు. కాబట్టి ఆ చిత్రంపై నిషేధం విధించాలని, తన కూతురు పేరును ఉపయోగించినందుకు నష్ట పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసును గురువారం విచారించిన న్యా యమూర్తి కే.కల్యాణసుందరం డా. ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్ర దర్శక నిర్మాతకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment