నటించాలి.. లేదంటే నష్టం చెల్లించాలి | Anjali must give loss of pay to Kalanjiyam says | Sakshi
Sakshi News home page

నటించాలి.. లేదంటే నష్టం చెల్లించాలి

Published Tue, Jun 24 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

నటించాలి.. లేదంటే నష్టం చెల్లించాలి

నటించాలి.. లేదంటే నష్టం చెల్లించాలి

నటి అంజలిపై ఇప్పుడు తమిళ నిర్మాతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ‘‘తమిళ దర్శకుడు కళంజియమ్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న ‘ఊరు సుట్రి పురాణమ్’ చిత్రంలో అంజలి నటించాల్సిందే. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇష్టపడకపోతే, నిర్మాతకు వాటిల్లిన నష్టాన్ని ఆమె భర్తీ చేయాల్సిందే’’ అని తమిళనాడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తాజాగా ప్రకటించింది. నిర్మాతల మండలి లాగానే చెన్నైలో నిర్మాతల గిల్డ్ ఒకటుంది. గత ఏడాది దాదాపు పదిహేను రోజులు తన సినిమా ‘ఊరు సుట్రి పురాణమ్’లో నటించిన అంజలి, ఆ తర్వాత అందులో నటించడానికి సుముఖంగా లేకపోవడంతో ఈ గిల్డ్‌ను ఆశ్రయించారు కళంజియమ్.

ఇంకా దర్శకుల సంఘం, నటీనటుల సంఘాల దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లినట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నలుగుతూ వస్తోంది. ఇప్పుడు తమిళంలో ‘జయం’ రవి సరసన ఓ చిత్రంలో నటించడానికి అంజలి అంగీకరించారనే వార్త రావడంతో, తన చిత్రాన్ని పూర్తి చేయకుండా అంజలి వేరే చిత్రంలో నటించడానికి వీల్లేదని కళంజియమ్ చాలా బలంగా వివాదం లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతల గిల్డ్ చొరవ తీసుకుంది. కళంజియమ్ దర్శకత్వంలోని సినిమాలో అంజలి కొనసాగాలనుకుంటే, తగిన భద్రత ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. ఒకవేళ నటించని పక్షంలో నిర్మాతకు నష్టపరిహారం చెల్లించాలంటూ అంజలికి లేఖ పంపినట్లు భోగట్టా.

అలాగే, కళంజియమ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేవరకూ అంజలిని మరి ఏ ఇతర కొత్త సినిమాల్లోనూ తీసుకోరాదంటూ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ నిర్మాతల మండళ్ళకు కూడా లేఖ పంపినట్లు సమాచారం. ఈ విషయమై అంజలి దోబూచులాడటం మానాలని, స్వయంగా నిర్మాతల మండలి వారిని కలవాలని నిర్మాతల గిల్డ్ ప్రధాన కార్యదర్శి జాగ్వార్ తంగమ్ కోరారు. ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిత్రాన్ని అంగీకరించడం, కుదరకపోతే అర్ధంతరంగా వాకౌట్ చేయడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొన్నారాయన.  మరి.. ఈ వివాదం నుంచి అంజలి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement