Kalanjiyam
-
'పాత్ర కోసం సర్జరీ చేయించుకున్నా'
సాక్షి, తమిళసినిమా: సాధారణంగా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. అదే నటులైతే పాత్ర స్వభావాన్ని బట్టి బరువు పెరగడానికో, తగ్గడానికో కసరత్తులు చేస్తుంటారు. అంతేకానీ పాత్ర కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటుడిని చూసి ఉండం. అయితే దర్శకుడు కలెంజయమ్ను చూసిన తరువాత ఇలాంటి వారు కూడా ఉంటారని నమ్మాల్సి వస్తుంది. ఇంతకు ముందు పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కలైంజయమ్లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇటీవల నటనపై అధిక దృష్టిసారిస్తున్న ఈయన ఈ మధ్య విడుదలైన కనవు తొళిల్సాలై చిత్రంలో యాంటీ కిడ్నాపింగ్ అధికారిగా నటించి మెప్పించారు. అయితే అంతకు ముందు కలైంజయమ్కు, ఈ చిత్రంలోని కలైంజయమ్కు అసలు పొంతనే లేదనిపించింది. అంతగా ఆ పాత్ర కోసం మారిపోయారు. అంతగా మార్పునకు కారణం ఏమిటన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, కనవు తొళిల్సాలై చిత్రంలో హిందువుల దేవుళ్ల విగ్రహాలను అక్రమంగా తరళింపును అరికట్టే అధికారి పాత్ర ఉంది నటిస్తారా? అయితే ఆ పాత్ర కోసం మీరు పూర్తిగా మారిపోవాలి. ముఖ్యంగా మీ శరీర రంగు మార్చుకోవాలి అని ఆ చిత్ర దర్శకుడు టి.కృష్ణసామి అడిగారన్నారు. దాన్ని తాను ఛాలెంజ్‌గా తీసుకుని చెన్నై ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణుడు కార్తీక్‌ను కలిసి తన రంగు మార్పు గురించి చర్చించానన్నారు. ఆయన మూడు నెలలు కష్టపడి తన శరీర రూపాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. ఆ తరువాత దర్శకుడు కృష్ణసామి చెప్పిన యాంటీ కిడ్నాపింగ్ అధికారి ఇర్ఫాన్ గా మారి ఆయన ముందు నిలిచానన్నారు.ఆయన తనను చూసి షాక్ అయ్యారని, వృత్తిపై తన శ్రద్ధను చూసి కనవు తొళిల్సాలై చిత్రంలో నటించే అవకాశం కల్పించారన్నారు ఇందులో తన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. -
అంజలీ... ఆదుకో!
అంజలి దర్శకుడు కలైంజియంను ఆదుకోవాలంటూ ఆయన సన్నిహితులు అభ్యర్థిస్తున్నారు. ఏమిటి అర్థం కాలేదా? అయితే చదవండి. నటి అంజలి ప్రధాన పాత్రలో ఊరు చుట్టి పురాణం అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కలైంజియం నిర్మించ తలపెట్టారు. ఇందులో నాయకుడు కూడా ఈయనే. చిత్ర నిర్మాణం కొంత భాగం పూర్తి అయ్యింది కూడా. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు కలైంజియంకు, నటి అంజలికి మధ్య మనస్పర్థలు వచ్చారుు. దీంతో ఒకరినొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుని వ్యవహారం కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఇప్పటికీ వీరి విభేదాలకు పరిష్కారం లభించలేదు. నటి అంజలి కలైంజియం చిత్రం చేసేది లేదని తేల్చి చెప్పేసింది. ఇలాంటి పరిస్థితిలో రుణం దొరకడంలేదు కదా ఇంతకు ముందు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి పెరుగుతోందట. దీంతో దర్శకుడు కలైంజియం దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని నటి అంజలి అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చి ఆదుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. ఇందుకు తమిళ చిత్ర సంఘాలు ప్రయత్నించాలని అర్థిస్తున్నారు. -
సినిమా డెరైక్టర్ కారుకు ప్రమాదం
మద్దిపాడు(ఆంధ్రప్రదేశ్): ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం కారు బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ (36) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సినిమా డెరైక్టర్ ముకళంజియం తన స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చి తిరుగు ప్రయాణంలో కొష్టాలు సెంటర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు కుడివైపు ముందు చక్రం పేలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండో వైపు రోడ్డులో నాలుగు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మద్దిపాడు ఎస్ఐకు సమాచారమందించడంతో కారులోని వారిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్‌పాండేకు తీవ్రగాయాలు కాగా, డెరైక్టర్ ముకళంజియం, నటుడు పెరుంజిత్తన్, డ్రైవర్ ఎస్.బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డెరైక్టర్ ముకళంజియం పూమణి, పూందొట్టం, కెలుక్కుమెరుక్కుం, మిటా మెరాస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మృతి చెందిన అరుణ్‌కుమార్ తంజావూరు జిల్లా పాపనాడుకు చెందినవారని తెలిసింది. ముకళంజియంది కూడా తంజావూరే. మద్దిపాడు ఎస్ఐ వి.మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కలైంజియం చిత్రం చెయ్యను
దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించనని అంజలి ఖరాఖండిగా చెప్పారు. రెండేళ్ల క్రితం పిన్నిపై ఆరోపణలు, దర్శకుడు కలైంజియంపై ఫిర్యాదులతో కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కోలీవుడ్‌కు దూరం అయ్యారు. తాజాగా ఈ అమ్మడు రీ ఎంట్రీ అయ్యారు. జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో పాల్గొనడానికి అంజలి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమిళంలో సుమారు రెండేళ్ల తరువాత నటిస్తున్నానని తెలిపారు. దర్శకుడు సూరజ్ చెప్పిన కథ ఎంతగానో నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తాను హాస్యం పండించనున్నట్లు చెప్పారు. ఇకపోతే తన గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. తన పెళ్లి జరిగిపోయినట్లు తానెవరి కట్టుబాటులోనో ఉన్నట్లు రకరకాల వదంతులు ప్రచారం అయ్యాయన్నారు. నిజానికి తానెవరి ఆధీనంలోను లేనని తనకు వివాహం జరగలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా తనకెలాంటి వ్యాధి లేదని వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే దర్శకుడు కలైంజియం సమస్య కోర్టులో ఉందన్నారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నలకు బదులివ్వనని పేర్కొన్నారు. ఇకపై తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తానని చెప్పారు. తనకెవరి నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదని తెలిపారు. ఇక్కడ చక్కని వాతావరణంలోనే షూటింగ్ జరుగుతోందని చెప్పారు. దర్శకుడు కలైంజియం చిత్రం ఊరు చుట్టి ప్రవరణంలో నటిస్తారా? అన్న ప్రశ్నకు నటించనని చెప్పినందుకే కదా ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి అంటూ అంజలి బదులిచ్చారు. -
నటించాలి.. లేదంటే నష్టం చెల్లించాలి
నటి అంజలిపై ఇప్పుడు తమిళ నిర్మాతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ‘‘తమిళ దర్శకుడు కళంజియమ్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్న ‘ఊరు సుట్రి పురాణమ్’ చిత్రంలో అంజలి నటించాల్సిందే. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇష్టపడకపోతే, నిర్మాతకు వాటిల్లిన నష్టాన్ని ఆమె భర్తీ చేయాల్సిందే’’ అని తమిళనాడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తాజాగా ప్రకటించింది. నిర్మాతల మండలి లాగానే చెన్నైలో నిర్మాతల గిల్డ్ ఒకటుంది. గత ఏడాది దాదాపు పదిహేను రోజులు తన సినిమా ‘ఊరు సుట్రి పురాణమ్’లో నటించిన అంజలి, ఆ తర్వాత అందులో నటించడానికి సుముఖంగా లేకపోవడంతో ఈ గిల్డ్‌ను ఆశ్రయించారు కళంజియమ్. ఇంకా దర్శకుల సంఘం, నటీనటుల సంఘాల దృష్టికి కూడా విషయాన్ని తీసుకువెళ్లినట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నలుగుతూ వస్తోంది. ఇప్పుడు తమిళంలో ‘జయం’ రవి సరసన ఓ చిత్రంలో నటించడానికి అంజలి అంగీకరించారనే వార్త రావడంతో, తన చిత్రాన్ని పూర్తి చేయకుండా అంజలి వేరే చిత్రంలో నటించడానికి వీల్లేదని కళంజియమ్ చాలా బలంగా వివాదం లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతల గిల్డ్ చొరవ తీసుకుంది. కళంజియమ్ దర్శకత్వంలోని సినిమాలో అంజలి కొనసాగాలనుకుంటే, తగిన భద్రత ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. ఒకవేళ నటించని పక్షంలో నిర్మాతకు నష్టపరిహారం చెల్లించాలంటూ అంజలికి లేఖ పంపినట్లు భోగట్టా. అలాగే, కళంజియమ్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేవరకూ అంజలిని మరి ఏ ఇతర కొత్త సినిమాల్లోనూ తీసుకోరాదంటూ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ నిర్మాతల మండళ్ళకు కూడా లేఖ పంపినట్లు సమాచారం. ఈ విషయమై అంజలి దోబూచులాడటం మానాలని, స్వయంగా నిర్మాతల మండలి వారిని కలవాలని నిర్మాతల గిల్డ్ ప్రధాన కార్యదర్శి జాగ్వార్ తంగమ్ కోరారు. ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిత్రాన్ని అంగీకరించడం, కుదరకపోతే అర్ధంతరంగా వాకౌట్ చేయడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొన్నారాయన. మరి.. ఈ వివాదం నుంచి అంజలి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే. -
నా సినిమాలను ఎవరూ అడ్డుకోలేరు
‘‘నావైపు తప్పు ఉండదని, నేను తప్పులు చేయనని అందరికీ తెలుసు. అందుకే నాకు సహయం చేయడానికి ముందుకొస్తున్నారు. నా సినిమాలను అడ్డుకోవాలని ఎవరో అంటున్నట్లు విన్నాను. కానీ, ఎవరూ అడ్డుకోలేరు ’’ అని శుక్రవారం అంజలి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆమె ఈ విధంగా పేర్కొనడానికి కారణం ఉంది. తమిళ దర్శకుడు కళంజియమ్ ఇటీవలి కాలంలో అంజలిపై మాటల తూటాలు విసురుతున్నారు. గత ఏడాది ఆయన దర్శకత్వంలో అంజలి ‘ఊరు సుట్రి పురాణమ్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే, ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దానికి గల కారణాలు బయటికి రాలేదు. కానీ, అంజలి సహకరించకపోవడంవల్లే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిందని కళంజియమ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న కళంజియమ్ని ‘ఊరు సుట్రి పురాణమ్’ గురించి పాత్రికేయులు అడిగారు.. గత ఏడాది మార్చిలో 12 రోజులు షూటింగ్ చేశామని, ఆ తర్వాత అంజలి ఈ సినిమా వదిలేసిందని కళంజియమ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, చలన చిత్ర వాణిజ్య మండలి, ఫెప్సి... ఇలా పలు సంఘాలను న్యాయం కోరి ఆశ్రయించానని, కానీ న్యాయం జరగలేదని కళంజియమ్ పేర్కొన్నారు. ఇప్పుడు అంజలి తమిళంలో ఓ సినిమా అంగీకరించినున్నారనే వార్త విని, ‘‘నా సినిమా పూర్తి చేయకుండా తను వేరే సినిమాలు చేయడానికి వీల్లేదు. అంజలి ఏ భాషలో నటించినా అక్కడి సినిమాలు విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాను’’ అంటూ కళంజియమ్ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే అంజలి ప్రకటన విడుదల చేశారని చెప్పొచ్చు. ఈ ప్రకటనలో కళంజియమ్ పేరు చెప్పకుండా.. ‘‘ఇప్పుడు నాకెలాంటి సమస్యలూ లేవు. నా సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయి’’ అన్నారు అంజలి. ఇంకా చెబుతూ -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఆ షూటింగ్ సజావుగా జరిగింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన నేను నటించనున్న కన్నడ సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. నాతో ఎవరికీ సమస్య రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. నాతో ఎవరైనా సినిమాలు చేయాలనుకుంటే, నిక్షేపంగా చేయొచ్చు. సందేహించక్కర్లేదు. ఇంతకు ముందు నా పాత్రలకు నేనెలా న్యాయం చేశానో ఇప్పుడూ అలానే చేస్తాను’’ అని స్పష్టం చేశారు. -
నటి అంజలి అరెస్ట్ అవుతుందా?
చెన్నై : నటి అంజలిని పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కలైంజయం ....ఆమెపై దాఖలు చేసిన పిటిషన్‌పై చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు పలుమారు్లు విచారణకొచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గత నెల 29న సైదాపేట కోర్టు నాన్‌బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అంజలి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నట్లు సమాచారం. దాంతో చెన్నై పోలీసులు కోర్టు అరెస్ట్ వారెంట్‌ను రాజోలు పోలీసులకు గురువారం పంపించినట్లు దర్శకుడు కలైంజయం న్యాయవాది జయప్రకాష్ తెలిపారు. దీంతో అంజలి అరెస్ట్ అవుతుందా లేక అంతకు ముందే కోర్టుకు హాజరు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కోలీవుడ్, టాలీవుడ్లో చర్చ సాగుతోంది.