నా సినిమాలను ఎవరూ అడ్డుకోలేరు
‘‘నావైపు తప్పు ఉండదని, నేను తప్పులు చేయనని అందరికీ తెలుసు. అందుకే నాకు సహయం చేయడానికి ముందుకొస్తున్నారు. నా సినిమాలను అడ్డుకోవాలని ఎవరో అంటున్నట్లు విన్నాను. కానీ, ఎవరూ అడ్డుకోలేరు ’’ అని శుక్రవారం అంజలి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆమె ఈ విధంగా పేర్కొనడానికి కారణం ఉంది. తమిళ దర్శకుడు కళంజియమ్ ఇటీవలి కాలంలో అంజలిపై మాటల తూటాలు విసురుతున్నారు. గత ఏడాది ఆయన దర్శకత్వంలో అంజలి ‘ఊరు సుట్రి పురాణమ్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించారు.
అయితే, ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. దానికి గల కారణాలు బయటికి రాలేదు. కానీ, అంజలి సహకరించకపోవడంవల్లే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిందని కళంజియమ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న కళంజియమ్‌ని ‘ఊరు సుట్రి పురాణమ్’ గురించి పాత్రికేయులు అడిగారు.. గత ఏడాది మార్చిలో 12 రోజులు షూటింగ్ చేశామని, ఆ తర్వాత అంజలి ఈ సినిమా వదిలేసిందని కళంజియమ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, చలన చిత్ర వాణిజ్య మండలి, ఫెప్సి... ఇలా పలు సంఘాలను న్యాయం కోరి ఆశ్రయించానని, కానీ న్యాయం జరగలేదని కళంజియమ్ పేర్కొన్నారు. ఇప్పుడు అంజలి తమిళంలో ఓ సినిమా అంగీకరించినున్నారనే వార్త విని, ‘‘నా సినిమా పూర్తి చేయకుండా తను వేరే సినిమాలు చేయడానికి వీల్లేదు.
అంజలి ఏ భాషలో నటించినా అక్కడి సినిమాలు విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాను’’ అంటూ కళంజియమ్ ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే అంజలి ప్రకటన విడుదల చేశారని చెప్పొచ్చు. ఈ ప్రకటనలో కళంజియమ్ పేరు చెప్పకుండా.. ‘‘ఇప్పుడు నాకెలాంటి సమస్యలూ లేవు. నా సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయాయి’’ అన్నారు అంజలి. ఇంకా చెబుతూ -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
ఎలాంటి ఆటంకం లేకుండా ఆ షూటింగ్ సజావుగా జరిగింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన నేను నటించనున్న కన్నడ సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. నాతో ఎవరికీ సమస్య రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. నాతో ఎవరైనా సినిమాలు చేయాలనుకుంటే, నిక్షేపంగా చేయొచ్చు. సందేహించక్కర్లేదు. ఇంతకు ముందు నా పాత్రలకు నేనెలా న్యాయం చేశానో ఇప్పుడూ అలానే చేస్తాను’’ అని స్పష్టం చేశారు.